Nikhil Karthikeya 2: ఆసక్తి రేకెత్తించే కథాంశం.. కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్.. ఉత్కంఠ రేపే సన్నివేశాలు.. వీటన్నిటి కలబోతగా 'కార్తికేయ-2' రానుంది. నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ కథానాయిక. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలకపాత్ర పోషించారు. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కి సూపర్‌హిట్‌గా నిలిచిన 'కార్తికేయ'(2014)కి ఈ చిత్రం సీక్వెల్. చరిత్ర, ఇతిహాసాల నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఆగస్టు 13న విడుదల కానున్న 'కార్తికేయ-2' విశేషాలను యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రేక్షకులతో పంచుకున్నారు. ఆ విశేషాలు మీకోసం..
కార్తికేయ-2 కథ మీ దగ్గరికి ఎలా వచ్చింది?
నిఖిల్:'కార్తికేయ' (2014) సూపర్‌హిట్ అయినప్పుడే దర్శకుడు చందూ మొండేటి దీనికి సీక్వెల్ ఉంటుందని నాతో అన్నారు. దాన్ని ఇంకా గ్రాండ్‌గా తీయాలని అప్పుడే చెప్పారు. మేమంతా కలిసి 2016లో శ్రీలంక వెళ్లినపుడు, అక్కడ అశోకవనాన్ని సందర్శించాం. ఆ సమయంలోనే చందూ 'కార్తికేయ-2' స్టోరీ లైన్ చెప్పాడు. కథ బాగా నచ్చడంతో అప్పుడే వర్క్ ప్రారంభించాం. మధ్యలో కొవిడ్ కారణంగా కొంత ఆలస్యమైంది.
సీక్వెల్ పూర్తి చేయడానికి చాలా సమయం తీసుకున్నారు.. కొవిడ్ ఒక్కటే ప్రధాన కారణమా?
నిఖిల్: ఇది పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి చాలా జాగ్రత్తగా తీశాం. రియల్ లొకేషన్లలో సన్నివేశాలను చిత్రీకరించాం. ప్రత్యేక అనుమతుల కోసం నెలల తరబడి వేచి చూశాం. తెరపై అద్భుతాన్ని చూపించాలనే ఉద్దేశంతోనే, మధ్యలో ఓటీటీ ఆఫర్లు వచ్చినా తిరస్కరించాం. కార్తికేయ-2 అనుకున్నది అనుకున్నట్లు తీయడానికి ఇంత సమయం పట్టింది.
మీరు తెరపై కనపడి చాలా కాలమైంది..ప్రేక్షకుల ఆదరణ ఎలా ఉంటుందంటారు?
నిఖిల్: అర్జున్ సురవరం (2019) థియేటర్లలో విడుదలైనప్పుడు ప్రేక్షకులు ఆదరించారు. అది సూపర్ హిట్ అయ్యింది. దాదాపు రెండున్నర సంవత్సరాల తరవాత ప్రేక్షకులకు మళ్లీ తెరపై కనిపించబోతున్నాను. ఆలస్యం అవ్వడం తప్పే కానీ తప్పలేదు. ఎందుకంటే 'కార్తికేయ-2' లాంటి సినిమా రావడానికి ఈ మాత్రం సమయం పడుతుంది.
'కార్తికేయ' సినిమాతో పోల్చుకుంటే 'కార్తికేయ-2'కి ఉన్న ప్రత్యేకతలేంటి?
నిఖిల్: 'కార్తికేయ'లో నేను వైద్య విద్యార్థిగా కనిపిస్తాను. 'కార్తికేయ-2'కి వచ్చేసరికి పూర్తి పరిణితి చెందిన పాత్రలో నటించాను. డాక్టర్ పాత్రే అయినా డిటెక్టివ్ కార్తీక్‌గా నన్ను ప్రేక్షకులు గుర్తిస్తారు. ఇంకా అడ్వెంచర్లు కూడా చాలా ఉంటాయి. కథాంశం కూడా కొత్తగా మరింత ఉత్కంఠ కలిగించేలా ఉంటుంది.
ఈ సినిమా టీజర్, ట్రైలర్‌లు ‘ఇండియానా జోన్స్’లాంటి సినిమాలను తలపిస్తున్నాయి..ఆ జోనర్‌లోనే తీశారా?
నిఖిల్:మన భారతీయ చరిత్ర, ఇతిహాసాల్లో ఎన్నో అడ్వెంచర్స్ ఉన్నాయి. అవన్నీ రహస్యంగా ఉండిపోయాయి. వాటి గొప్పతనాన్నే ‘కార్తికేయ’లో చూపించాం. ఈసారి మరింత లోతుగా 'కార్తికేయ-2'ద్వారా ప్రేక్షకులకు చూపించబోతున్నాం. భారతీయత గొప్పతనాన్ని ఆవిష్కరించే చిత్రంగా కార్తికేయ-2 ఉంటుంది.
'కార్తికేయ-2' చరిత్ర కోణంలో ఉంటుందా?పురాణాల నేపథ్యంలో తీశారా?
నిఖిల్:‘కార్తికేయ-2’ ట్యాగ్‌లైన్ హిస్టరీ వర్సెస్ మైథాలజీ. ఇండియన్ మైథాలజీకి సైంటిఫిక్ క్లారిటీ ఇచ్చాం. అదీ ప్రేక్షకుడు మెప్పు పొందేలా ఉంటుంది. 'కార్తికేయ'లో ఆ ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాం. ఈసారి మరింత విశ్లేషణతో 'కార్తికేయ-2' ద్వారా స్పష్టతనిస్తాం.
మీరు వ్యక్తిగతంగా దేవున్ని నమ్ముతారా? సైన్స్‌నా?
నిఖిల్: ఈ సినిమాకి ఒక కొటేషన్ ఉంటుంది. 'దైవం మానుష్యరూపేణా' అని. నేను వ్యక్తిగతంగా ఆ సిద్ధాంతాన్ని నమ్ముతాను. దానికి సైన్స్ కూడా అతీతం కాదు కాబట్టి సైన్స్‌ను నమ్ముతున్నట్లే. ఆ క్లారిటీతోనే మేము కార్తికేయ-2ని రూపొందించాం.
ఈ సినిమాకు సంబంధించి మీకు బాగా నచ్చిన అంశమేంటి?
నిఖిల్: కథాంశం. మేము తీసుకున్న పాయింటే బలమైనది. దానికి మేం ఆధునిక హంగులు జోడించాం. విజువల్ ఎఫెక్ట్స్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఇంకా కాలభైరవ సంగీతం ఈ సినిమాకి అదనపు బలం.