టాలీవుడ్‌లో హాసినిగా అందరి మనసులు దోచేసింది జెనీలియా. ఈ అమ్మడికి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. తాజాగా ఈ క్యూట్ హీరోయిన్ మరాఠాలో తన భర్త రితేష్ దేశ్‌ముఖ్‌తో కలిసి నటించిన సినిమా వేద్. తెలుగులో విడుదలై సూపర్ హిట్ అయిన మజిలీకు(నాగచైతన్య-సమంత) రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఈ సినిమా మరాఠాలో మంచి వసూళ్లను అందుకుంటోంది. ఇప్పటివరకూ ఈ సినిమా రూ.44.92కోట్ల వసూళ్లను అందుకున్నట్లు సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ తెలిపారు.
కాగా, బాలీవుడ్ నటుడిగా రితేశ్ దేశ్‌ముఖ్ అందరికీ సుపరిచితుడే. 'వేద్'తో మెగా ఫోన్ పట్టి దర్శకుడిగా మారారు. అంతేకాదు, ఈ చిత్రంతోనే పదేళ్ల తర్వాత జెనీలియా మళ్లీ వెండితెరపై మెరిశారు. కేవలం రూ.15కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీని తెరకెక్కించారు. తెలుగులో నాగచైతన్య పాత్రను రితేశ్, సమంత పాత్రను జెనీలియా పోషించారు. నూతన సంవత్సర కానుకగా డిసెంబరు 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.