'నటుడిగా మళ్లీ నా విశ్వరూపాన్ని చూపిస్తా' అని అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన ప్రధాన పాత్రలో నటించిన 'ఆచార్య' ప్రమోషన్స్‌లో భాగంగా చిరు, చరణ్, కొరటాల శివతో దర్శకుడు హరీశ్‌శంకర్ స్పెషల్ చిట్‌చాట్ నిర్వహించారు. 'ఆచార్య' విశేషాలతోపాటు అవకాశం వస్తే తప్పకుండా పవన్ కల్యాణ్ 'భవధీయుడు భగత్ సింగ్'లో నటిస్తానని చిరు చెప్పారు. అంతేకాకుండా, 'భవధీయుడు భగత్ సింగ్' నుంచి ఓ పవర్‌ఫుల్ డైలాగ్‌ని చిరు లీక్ చేసేశారు. హరీశ్‌తో జరిగిన ఇంటర్వూలో చిరు చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే...
'పునాది రాళ్లు.. ఆరోజే అర్థమైంది'....:"పునాది రాళ్లు' సినిమా కోసం 1978 ఫిబ్రవరి 11న.. నేను మొదటిసారి కెమెరా ముందుకు వచ్చా. అందులో నాతోపాటు మరికొంతమంది ఆ సీన్‌లో ఉన్నారు. మేమంతా పొలం పనులు చేసి రాగానే, మహానటి సావిత్రమ్మ మాకు భోజనం వడ్డించే సీన్ అది. నా ప్లేస్ వచ్చే వరకూ నేను కెమెరా ముందు అలాగే నిల్చుని ఉండాలి. అది నాకు కాస్త ఇబ్బందిగా అనిపించింది. వెంటనే అసిస్టెంట్ డైరెక్టర్‌తో మాట్లాడి.. ఆ సీన్‌కి ముందు ఏ సీన్ వస్తుందో కనుక్కొని దానికి అనుగుణంగా నన్ను నేను కాస్త మార్చుకుని యాక్ట్ చేశాను. ఆ షాట్ పూరైన వెంటనే కెమెరామెన్ నన్ను పిలిచి.. 'నీ పేరేంటి? నువ్వు బాగా చేస్తున్నావ్? ఈ షాట్‌లో నేను నిన్నే చూస్తూ ఉండిపోయా' అని ప్రశంసించారు. ఆ మాటలకు నేనెంతో ఆనందించా. 'నా పేరు చిరంజీవి' అని చెప్పా. మన పాత్ర పరిధి మేరకు మనం వందశాతం నటించగలిగితే తప్పకుండా అందరూ ప్రశంసిస్తారని ఆరోజే అర్థమైంది"
'గ్లిజరిన్ వాడలేదు..!'....:"సిద్ధ పాత్రలో చరణ్ ఉంటే బాగుంటుందని నాకు ముందు నుంచే ఆలోచన ఉంది. శివ కూడా అలాగే అనుకోవడం వల్ల మేమిద్దరం ఒకే స్క్రీన్‌పై నటించే అవకాశం వచ్చింది. 'ఆచార్య' చరిత్రలో నిలిచిపోయే సినిమా కావాలంటే ప్రతిక్షణం మేము మరింత అప్రమత్తంగా ఉండాలి. ప్రేక్షకుల్ని మెప్పించేలా ప్రతి సన్నివేశంలో నటించాలని నిర్ణయించుకున్నాం. అందుకు అనుగుణంగా మేము నటించాం. కానీ, ఓ సన్నివేశంలో చరణ్ నటన చూసి నేను నిజంగానే భావోద్వేగానికి గురయ్యా. చరణ్‌ని ప్రేమగా దగ్గరకు తీసుకున్నా. ఆక్షణం మా ఇద్దరికీ కన్నీళ్లు వచ్చేశాయి. ఆ సీన్‌లో మేమిద్దరం గ్లిజరిన్ లేకుండానే కన్నీరు పెట్టుకున్నాం. సిల్వర్ స్క్రీన్‌పై ఈ సీన్ చూసినప్పుడు ఎంతటి కఠినాత్ముడైనా కన్నీళ్లు పెట్టుకోక తప్పదు"
'అవన్నీ ఊహాగానాలు..!'....:"ఆర్‌ఆర్‌ఆర్'లో బిజీగా ఉండటం వల్ల చరణ్ 'ఆచార్య' షూట్ కాస్త ఆలస్యంగా ప్రారంభించాడు. దాంతో నేను ఓసారి శివ దగ్గరకు వెళ్లి.. "శివ.. చరణ్ వల్ల సినిమా ఆలస్యమయ్యేలా ఉంది. కాబట్టి వేరే హీరోని సెలక్ట్ చేద్దామా?" అని అడిగా. మాటైతే చెప్పగలిగాను కానీ నాకు ఎంతమాత్రం అది ఇష్టం లేదు. మనస్ఫూర్తిగా సిద్ధ పాత్రకు చరణ్ అయితేనే బాగుంటుందని గట్టిగా నమ్మాను. అదే సమయంలో 'ఆచార్య'లోకి వేరే హీరోని తీసుకున్నామని వరుస కథనాలు వచ్చాయి. అవన్నీ ఊహాగానాలు మాత్రమే. ఎందుకంటే మేము ఎప్పుడూ వేరే హీరో గురించి ఆలోచించలేదు"
'తొమ్మిదేళ్లు ఆమె బాధపడింది..!'....:"చరణ్ నేనూ కలిసి నటిస్తే చూడాలని సురేఖ ఎన్నో కలలు కంది. నేను రాజకీయాల్లోకి వెళ్లడం.. చరణ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఒకే సమయంలో జరిగింది. దాంతో మేమిద్దరం కలిసి నటించే అవకాశం లేకుండా పోయింది. అలా, సురేఖ తొమ్మిదేళ్లు బాధపడుతూనే ఉంది. మరలా నేను సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాక.. ఆమె కోరిక మరోసారి జీవం పోసుకుంది. మేమిద్దరం పూర్తిస్థాయి పాత్రల్లో కలిసి నటిస్తే చూడాలనుకుంటున్నట్లు ఎన్నోసార్లు చెప్పింది. అలాంటి సమయంలోనే శివ ఓసారి ఈ కథతో వచ్చాడు. చరణ్, నేనూ 'ఆచార్య' సినిమాకి ఓకే అయ్యాక సురేఖతో ఈ విషయం చెప్పా. "నీ కోరిక చాలా బలమైంది. శివ చెప్పిన కథలో మేమిద్దరం నటిస్తున్నాం. ఇద్దరివీ వీరోచితమైన పాత్రలే. షూటింగ్ ప్రారంభించడానికి ఎదురుచూస్తున్నా" అని సురేఖతో చెప్పగానే ఆమె కళ్లలో అంతులేని ఆనందం చూశా"