Chirnajeevi Acharya movie: "తొలిసారి కథ వినగానే బాగుందని చెప్పి, చేసిన ప్రతీ సినిమా సూపర్ హిట్ అయ్యింది. కథ వినేటప్పుడు కామెడీ సన్నివేశాలు ఎన్నొస్తాయి? ఫైట్లు ఎన్నుంటాయి? ఎంత గ్లామర్ ఉంటుందనేది చూడను. నా మెదడుకి ఏది తాకుతుందో దాన్ని పట్టించుకోను. హృదయానికి ఏదైతే తాకుతుందో అదే నాకు ముఖ్యం. అందుకని దర్శకులు కథ చెబుతామంటే నేను వింటానని కాకుండా, చూస్తానని చెబుతా. కథ అందరం వింటాం కానీ, నాకు మాత్రం కథ చెప్పేటప్పుడు దాదాపుగా ఫస్ట్ కాపీ చూసినట్టుగా అనిపిస్తుంది. అందులో తప్పొప్పులు ఇట్టే తెలిసిపోతుంటాయి. ఏది హృదయాల్ని టచ్ చేస్తుందో, ఏది కళ్లు చెమర్చేలా ఉంటుందో అర్థమవుతుంది."
నిర్మాణ దశలో 'ఆచార్య'కి వచ్చిన ఇబ్బందులేంటి? వాటిని ఎలా అధిగమించారు?
అన్నిటికీ వచ్చినట్టుగానే మా సినిమాకీ కరోనా పాజిటివ్ వచ్చింది (నవ్వుతూ). అయినా మేం ఎక్కడా తొణకలేదు. సహనం, సంయమనంతో వ్యవహరించాం కాబట్టి మరింత ఉత్సాహంగా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. రామ్‌చరణ్ ‘ఆర్‌ఆర్‌ఆర్’తో బిజీగా ఉండటంతోనూ మాకు కొంచెం జాప్యం జరిగింది. మరి రామ్‌చరణ్ కోసమే ఎందుకు ఎదురు చూడాలి? మరో యువ కథానాయకుడిని తీసుకోవచ్చు కదా? అనే ప్రశ్నలు రావచ్చు. చరణ్ లేకపోతే ఈ సినిమా లేదన్నారు దర్శకుడు కొరటాల శివ. నిజంగానే చరణ్, చిరంజీవి కోసమే డిజైన్ చేసిన కథ ఇది. తెరపై మా పాత్రల మధ్య ఎలాంటి బంధం ఉండదు, కానీ ప్రేక్షకులు ఫీల్ అవుతారు. అదే ఇక్కడ ప్రత్యేకత.
ఈ ప్రాజెక్టుకు బీజం ఎలా పడింది?
కొరటాల శివను అతని తొలి సినిమా నుంచీ చూస్తూ వచ్చాను. రచయితగా ‘అన్నయ్య’ సినిమా నుంచి ఉన్నానని ఈమధ్య తను చెబితేనే నాకు తెలిసింది. నేను రాజకీయాల్లోకి వెళ్లి పరిశ్రమకి దూరంగా ఉన్న సమయంలో ఆయన దర్శకుడిగా తనదైన ప్రావీణ్యం ప్రదర్శిస్తూ విజయవంతంగా ఎదిగారు. నేను తిరిగి రావాలనుకున్నప్పుడు కొరటాలలాంటి దర్శకుడితో కాంబినేషన్ కుదిరితే నా పునః ప్రవేశం బాగుంటుందని అనేవాణ్ని. అయితే రామ్‌చరణ్ - కొరటాల కలిసి ఓ సినిమా చేయాలనుకున్నారు. ‘మీతో నేనెప్పుడైనా సినిమా చేసుకుంటా, మొదట డాడీతోనే చేస్తాన’న్నారు కొరటాల. తర్వాత కొద్ది రోజుల్లోనే ఓ కథతో వచ్చారు. మీరూ, చరణ్ ఇద్దరూ కలిసి చేయాల్సిన కథ ఇదని చెప్పారు. అలా మా కలయికలో ‘ఆచార్య’ కుదిరింది.
రామ్‌చరణ్‌ని చిన్నప్పుడు సరదాగా సెట్‌కి తీసుకెళ్లడం దగ్గర్నుంచి... సహ నటుడిగా సెట్‌ని పంచుకోవడం వరకూ.. ఆ అనుభూతులేంటి?
మద్రాస్‌లో ఉన్నప్పుడు సెట్‌కి ఆట విడుపుగానే వచ్చేవాడు చరణ్. తను పదిహేనేళ్ల కుర్రాడు అయ్యేవరకు సినిమా ప్రభావం ఎంత? నేను ఏ స్థాయి నటుడినో తెలియదు. సినిమామీద ఆసక్తి. నటించాలనే కోరిక ఏమాత్రం ఉండేవి కావు. హైదరాబాద్‌కి వచ్చాక, కాలేజీలో చేరాక మన సినిమా పరిధితోపాటు, మన సంస్కృతిలో అదొక భాగం అని తనకి తెలిసొచ్చాయి. ఈ రంగంలో రాణించడం దేవుడిచ్చిన వరం అని తను తెలుసుకున్నాడు. ఎప్పుడైతే ఆసక్తి ఏర్పడిందో, ఇక వెనుదిరిగి చూసుకోలేదు. ముంబయిలో మూడు నెలలు తప్ప తను పెద్దగా తర్ఫీదు పొందలేదు. కష్టేఫలి అని నేను నమ్మినట్టుగానే తనూ ఆచరిస్తున్నాడు. దర్శకుడు రాజమౌళి చెప్పినట్టుగా తను మనసులో ఏదీ పెట్టుకోకుండా ఓ తెల్లకాగితంలానే సెట్‌కి వస్తాడు. ఎంతైనా కష్టపడతాడు.
యువతరం దర్శకులతో కలిసి పనిచేయడంపై మీరు ఆసక్తి చూపుతున్నారు. వ్యూహంలో భాగమే అనుకోవచ్చా?
యువతరం కొత్త ఆలోచనలతో వస్తున్నారు. దాంతో నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకునే అవకాశం లభిస్తోంది. వాళ్లకి నేను ఉపయోగపడుతూ, వాళ్లని నేను ఉపయోగించుకుంటూ ముందుకు వెళుతున్నా. నా వింటేజ్ లుక్, నా ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని యువతరం దర్శకులు సినిమాల్ని రూపొందిస్తున్నారు. వాళ్ల ఆలోచనలకి, ఉన్నత ప్రమాణాలతో కూడిన సాంకేతిక పరిజ్ఞానం తోడైందంటే ఆ ప్రభావం ఎలా ఉంటుందనేది ఇక నుంచి వరుసగా రానున్న నా సినిమాలే చెబుతాయి.
ఒకేసారి ఐదు ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపి, అందులో నాలుగు చిత్రీకరణలతో బిజీగా గడుపుతున్నారు. ఒకేసారి అన్ని చిత్రాల్లో చేయడం ఎలా సాధ్యమవుతోంది?
ఇంకో విషయం చెప్పనా! ఇవి కాకుండా మరో ఐదు సినిమాలు సిద్ధంగా ఉన్నాయి(నవ్వుతూ). మేమంతా ఎంతో పుణ్యం చేసుకోబట్టే ఈ రంగంలోకి వచ్చాం. వచ్చిన తర్వాత ఎంత సంతోషిస్తామో ఈ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోతే అంత బాధపడతాం. నిలబెట్టుకోవాలంటే నిరంతరం ఇదే రకంగా పని చేయాలి. 24 గంటలు చిత్రీకరణ అన్నా నాకు విసుగు రాదు. ‘గాడ్‌ఫాదర్’ కోసం రాత్రిళ్లు షూటింగ్ చేశాం. బాబీ దర్శకత్వం వహిస్తున్న సినిమా కోసం రాత్రిళ్లే పనిచేశాం. ఎక్కడా విసుగు లేకపోగా మరింత ఉత్సాహం కలుగుతోంది. నా కష్టమే నన్ను ఆరోగ్యవంతుడిని చేస్తుంది. నేను కష్టపడేంతవరకు ఈ పరిశ్రమ నన్నెప్పుడూ అక్కున చేర్చుకుంటుందని బలంగా నమ్ముతాను.