తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Boys Hostel Movie Telugu Review : కన్నడలో 'రష్మి' బ్లాక్ బస్టర్ మూవీ.. మరి తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా?

Boys Hostel Movie Telugu Review : కన్నడలో బ్లాక్ బస్టర్​ హిట్ట్ కొట్టి తెలుగులో డబ్​ అయిన సినిమా 'హాస్టల్‌ హుడుగారు బేకగిద్దరే'. ఈ సినిమా ఇప్పుడు తెలుగులో 'బాయ్స్​ హాస్టల్'గా శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందంటే ?

boys hostel telugu review
బాయ్స్​ హాస్టల్ తెలుగు మూవీ రివ్యూ

By ETV Bharat Telugu Team

Published : Aug 26, 2023, 12:05 PM IST

Boys Hostel Movie Telugu Review :చిత్రం: బాయ్స్‌ హాస్టల్‌; నటీనటులు: ప్రజ్వల్​ బీపీ, మంజునాథ్‌ నాయక, శ్రీవాస్తవ, తేజస్‌ జయన్న తదితరులు; సంగీతం: అజనీష్‌ లోకనాథ్‌; నిర్మాత: వరుణ్‌ గౌడ, నితిన్‌ కృష్ణమూర్తి, సినిమాటోగ్రఫీ: అరవింద్‌ ఎస్‌. కశ్యప్‌; ఎడిటింగ్‌: సురేష్‌; ప్రజ్వల్‌, అరవింద్‌; రచన, దర్శకత్వం: నితిన్‌ కృష్ణమూర్తి; విడుదల: 26-08-2023

కొత్త ఆలోచనలకి బీజం వేసేలా అప్పుడప్పుడూ ఏదో ఒక భాష నుంచి ఏదో ఒక సినిమా వస్తుంటుంది. ఇలా కూడా చేయొచ్చు అంటూ కొత్త దారులు చూపిస్తుంటాయి ఆ సినిమాలు. ఈ క్రమంలో శాండల్​వుడ్​లో రూపొందిన సినిమానే... 'హాస్టల్‌ హుడుగారు బేకగిద్దరే'. ఈ సినిమా తెలుగులో 'బాయ్స్‌ హాస్టల్‌'గా విడుదలైంది. అన్నపూర్ణ స్టూడియోస్, ఛాయ్‌ బిస్కెట్‌ సంస్థలు సంయుక్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం వల్ల ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి ఏర్పడింది. ఇక ఈ సినిమా ఎలా ఉందంటే ?

కథేంటంటే: హాస్టల్‌ క్యాంపస్‌లో ఓ రాత్రి జరిగే కథ ఇది. అజిత్‌ (ప్రజ్వల్‌)ఓ షార్ట్​ ఫిల్మ్​ కోసం తన హాస్టల్, రూమ్​మేట్స్​, వార్డెన్‌(మంజునాథ నాయక్‌) చుట్టూసాగే ఓ కథ రాసుకుంటాడు. ఆర్మీలో పనిచేసి వచ్చానంటూ చెప్పే వార్డెన్‌ చాలా స్ట్రిక్ట్‌. ఎవ్వరు తప్పు చేసినా శిక్షిస్తూ ప్రిన్సిపల్‌కి ఫిర్యాదు చేస్తానంటూ బెదిరిస్తుంటాడు. ఇక ఒకానొక దశలో స్టూడెంట్స్ అంతా అతనిపై కోపంతో రగిలిపోతూ తిరగబడి దాడి చేస్తారు. ఈ క్రమంలోనే ఎవ్వరూ ఊహించని రీతిలో పైఅంతస్తుపై నుంచి కిందపడి ఆ వార్డన్​ ప్రాణాలు కోల్పోతాడు. దాంతో విద్యార్థులంతా షాక్‌ అవుతారు. వార్డెన్‌ మరణంతో తమకేమీ సంబంధం లేదన్నట్టుగా... అదొక రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలనే ప్లాన్‌ చేస్తారు. ఆ క్రమంలో ఏం జరిగిందన్నదే తన లఘు చిత్రకథ అని చెబుతాడు అజిత్‌. ఇది కూడా ఒక కథేనా అని అంతా ఎద్దేవా చేస్తారు. ఇంతలోనే ఊహించని మలుపు. టీ ఎప్పుడొస్తుందని అడగడానికి వెళ్లిన ఓ విద్యార్థి హడావుడిగా వచ్చి వార్డెన్‌ నిజంగానే చనిపోయాడని చెబుతాడు. వెళ్లి చూస్తే అజిత్‌ రూమ్​మేట్స్​ పేర్లు రాసి ఉన్న ఓ సూసైడ్‌ లెటర్‌ వాళ్లకు దొరుకుతుంది. ఇంతకీ ఆ లెటర్‌లో ఏం రాసి ఉంది? హాస్టల్‌ వార్డెన్‌ మరణం వెనక ఎవరున్నారు? ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే:ఇదొక యూత్​ఫుల్​ ఎంటర్​టైనర్​ మూవీ. ఈ కథ వెనక ఆలోచన, తెరపైన పాత్రల సందడి, నేపథ్యం... అంతా కూడా నవతరానికి వినోదం పంచేదే. ఇలాంటి ఆలోచనతో కూడా ఓ సినిమా చేయొచ్చా అని ఆశ్చర్యపోయేలా చేస్తుంది ఈ మూవీ. సగటు సినిమాల్లాగా ఇది హీరో హీరోయిన్ల కథ కాదు. ఇందులో అన్నీ పాత్రలే. వందలకొద్దీ పాత్రలు వచ్చి సందడి చేసి వెళ్లిపోతుంటాయి. లాజిక్‌ సంగతిని పక్కనపెట్టి చూస్తే.... కడుపుబ్బా నవ్విస్తుంది ఈ చిత్రం. 'జాతిరత్నాలు' సినిమాలోని నాలుగు ప్రధానపాత్రల్లోని తింగరితనం ఇందులో చాలా పాత్రల్లో కనిపిస్తుంటుంది. దాంతో ఇక నవ్వులే నవ్వులు. హాస్టల్‌వార్డెన్‌ ఆత్మహత్య చేసుకోవడం నుంచి మొదలయ్యే కలకలంతో నవ్వుల ప్రయాణం మొదలవుతుంది. బాడీ ఎవరి కంట పడుకూడదని వేసే ప్లాన్స్‌... మేధావుల్లాగా కనిపించే సీనియర్ల గ్యాంగ్‌ సాయం తీసుకోవడం, ఇక వాళ్లకి మరో ముగ్గురు సూపర్‌ సీనియర్లు కలవడం... ఇలా సినిమా అంతా సందడే సందడి.

ప్రతీ సన్నివేశం నవ్వించేదే. విరామంలో మలుపు మరింత ఆసక్తి రేకెత్తిస్తుంది. అయితే, సెకెండ్​ హాఫ్​లో అజిత్‌ 'ఇక ఇంతటితో ఆపేద్దాం' అని చెప్పడంతో అప్పటిదాకా కథలో కొనసాగిన ఆసక్తి కాస్త తగ్గుతుంది. అయితే కామెడీ ఉద్ధృతి మాత్రం తగ్గదు. చివరివరకూ ఏదో ఒక పాత్ర నవ్విస్తూనే ఉంటుంది. ఇదొక విజయవంతమైన ప్రయోగం. ఇలాంటి సినిమాలకి సంభాషణలు, అందులోని నేటివిటీ కీలకం. అనువాదంగా వచ్చినా మనదైన నేటివిటీకి అనుగుణంగా సంభాషణల్ని రాసి జోడించిన విధానం, వందల కొద్దీ పాత్రలకి డబ్బింగ్‌ పరంగా తీసుకున్న జాగ్రత్తలు తీరు చాలా బాగున్నాయి. అయితే హాస్టల్‌ వాతావరణం, పచ్చితాగుబోతుల్లా కనిపించే కొన్ని పాత్రలు, వాళ్లు స్టూడెంట్స్‌ అన్నట్టుగా చూపించిన విధానమే ఏమాత్రం సహజంగా అనిపించదు. కొన్ని సన్నివేశాలు రిపీట్​ అవుతున్నట్లు అనిపిస్తుంది. హాస్టల్స్‌ అంటే ఇలా ఉంటాయా అనే భయం పుట్టిస్తుంది. ఇలాంటి కొన్ని లాజిక్‌లను పక్కనపెడితే సినిమా ఆద్యంతం నవ్వుల ప్రయాణమే.

ఎవరెలా చేశారంటే?సినిమాలో ప్రతి పాత్ర సినిమాకు కీలకమే. ఒక లైవ్‌ వీడియో అన్నట్టుగా ఉండే ఈ సినిమాలో ప్రతీ పాత్ర, సీన్​ నేచురల్​గానే ఉంటుంది. అందుకు తగ్గట్టే నటించారు అందరూ. ఇక హాస్టల్‌ వార్డెన్‌గా మంజునాథ నాయక్‌ నటన ఆకట్టుకుంటుంది. నటులు, దర్శకులైన 'కాంతార' ఫేమ్‌ రిషబ్‌ శెట్టి, 'యూ టర్న్‌'ఫేమ్‌ పవన్‌ కుమార్‌.. ఈ సినిమాలో సూపర్‌ సీనియర్లుగా కనిపించి సందడి చేశారు. మరోవైపు చిత్ర దర్శకుడు నితిన్‌ కృష్ణమూర్తి మేథావిలా కనిపిస్తూ ప్రసంగాలతో బెదరగొట్టే పాత్రలో కడుపుబ్వా నవ్వించాడు. 'జబర్దస్త్'​ ఫేమ్ యాంకర్​ రష్మి సినిమా ఆరంభం నుంచి చివరి వరకూ కనిపిస్తుంది. గ్లామర్‌గా కనిపిస్తూ చివరి వరకూ ఊరిస్తూ ఉంటుంది ఆ పాత్ర. నాయుడుగా తరుణ్‌ భాస్కర్‌ చేసే సందడి కూడా ఆకట్టుకుంటుంది. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. ప్రయోగంలాంటి ఈ సినిమాని అంతే ప్రయోగాత్మకంగా చిత్రీకరించారు సినిమాటోగ్రఫర్​ అరవింద్‌ కశ్యప్‌. ఎడిటింగ్, అజనీష్‌ సంగీతం సినిమాకు హైలైట్​. రచయితగా, దర్శకుడిగా నితిన్‌కృష్ణమూర్తి పనితీరు భేష్‌. ఆయన, ప్రజ్వల్‌ తన ఫ్రెండ్స్​తో కలిసి ఈ సినిమాని నిర్మించారు.

  • బలాలు
  • + కథలో మలుపులు
  • + కామెడీ సంభాషణలు
  • + పాత్రల చిత్రీకరణ
  • బలహీనతలు
  • - ద్వితీయార్ధంలో కొన్ని సన్నివేశాలు
  • -వాస్తవికత దూరంగా కొన్ని సీన్స్‌
  • చివరిగా: బాయ్స్‌ హాస్టల్‌... 'అల్లరే అల్లరి నవ్వులే నవ్వులు'
  • గమనిక:ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

ABOUT THE AUTHOR

...view details