Bollywood upcoming Biopic movies 2022: తినగ తినగ వేప తియ్యగా ఉంటుందో లేదో తెలియదు కానీ ఎక్కువగా వాడేస్తే పంచదార చేదుగానే తోస్తుందనేది అనుభవ పూర్వక సమాధానం. అలాగే హిట్ ఫార్ములా కదా అని ఒకే జోనర్‌లో వరస పెట్టి సినిమాలు తీస్తే ప్రేక్షకుడికి చప్పగా ఉంటుంది. బాలీవుడ్‌లో విరామం లేకుండా వస్తున్న బయోపిక్‌ల గురించే సినీవిశ్లేషకులు అంటున్న మాట ఇది. 'ఆర్‌ఆర్‌ఆర్' విజయం గురించి ప్రస్తావిస్తూ టాలీవుడ్ తనదైన శైలిలో ముందుకు వెళ్తోందని తనతో సహా బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ అందరూ బయోపిక్‌ల వెంట పడుతున్నామని కరణ్ జోహార్ వ్యాఖ్యానించాడు. దీంతో కొంత కాలంగా సాగుతున్న బయోపిక్‌ల జాతరకు క్లైమాక్స్ ఎప్పుడన్న చర్చ హిందీ చిత్రసీమలో మొదలయ్యింది.
ఫ్లయింగ్ సిఖ్ మిల్కా సింగ్ జీవితచరిత్రగా 2013లో వచ్చిన ‘భాగ్ మిల్కా భాగ్’ చిత్రంతో బాలీవుడ్ దర్శకుల దృష్టి ఈ తరహా సినిమాలపై పడింది. అనంతరం 2016లో సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ హీరోగా నీరజ్ పాండే దర్శకత్వంలో వచ్చిన ఎమ్.ఎస్ ధోనీ చిత్ర విజయంతో ఇది హిట్ ట్రెండ్‌లా మారింది. తర్వాత వరసగా దంగల్, నీర్జా, సర్దార్ ఉద్ధం సింగ్, సైనా, శకుంతల దేవి, తలైవి, 83, తాజాగా అలియా భట్ నటించిన గంగూభాయ్ కాఠియావాడి లాంటి నిజ జీవిత చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇందులో కొన్ని భారీ హిట్‌లు అందుకొంటే... మరికొన్ని అంతగా ప్రేక్షకాదరణ పొందలేకపోయాయి.
ఆత్మ పట్టుకుంటే...మరుగున పడిపోయిన దిగ్గజాల జీవిత చరిత్రలను తెరకెక్కించాలనే ఉద్దేశం మంచిదే అయినప్పటికీ విరామం లేకుండా బయోపిక్‌లు వస్తుండటంతో కొత్త సినిమా చూస్తున్న అనుభూతి రావట్లేదని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. బయోపిక్‌ల చిత్రీకరణ రెండు వైపులా పదునున్న కత్తి లాంటిదని దర్శకులు అభిప్రాయం. కచ్చితంగా ఉన్నది ఉన్నట్లు తీస్తే అది డాక్యుమెంటరీలా ఉంటుంది. అతి చొరవ తీసుకుని కమర్షియల్ అంశాలు జోడిస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదముంటుంది. కథతో పాటు అందులోని ఆత్మనూ తీసుకుని తెరకెక్కించిన భాగ్ మిల్కా భాగ్, ఎమ్.ఎస్. ధోని లాంటి చిత్రాలు క్లాసిక్‌లుగా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయాయి. భావోద్వేగాలు, ప్రేక్షకులను మెప్పించే యాక్షన్ ప్రధానంగా కథనం సాగితే ప్రయోజనం ఉంటుందనేది బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్ల అభిప్రాయం. వీటిని సమపాళ్లలో రంగరించకే ఇదే జోనర్‌లో వచ్చిన మరికొన్ని చిత్రాలు ప్రేక్షకుల ఆదరణను పొందలేకపోయాయి. ప్రస్తుతం ఈ జోనర్‌లో వస్తున్న సినిమాలలో తారలు, కథనం చెప్పే విధానం మారుతోంది కానీ కథ చూసినట్టే ఉంటోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆటగాళ్ల బయోపిక్‌లలో ప్రధాన పాత్రకు చిన్ననాటి నుంచి ఆటలపై ఆసక్తి ఉండటం, ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు, కష్టాలను బిగపట్టి ప్రాక్టీస్ చేయడం, క్లైమాక్స్‌లో విజయాన్ని అందుకోవడంతోనే ప్రతి సినిమా వస్తోంది. ఇతర జోనర్లలోనూ ఒకే తరహా విధానంతో కథనాలు ఉంటున్నాయి. అందుకే పాత కథైనా కొత్త కథనంతో తెరకెక్కిస్తే... బాక్స్‌ఫీస్ పంట పండుతుంది. హిందీ పరిశ్రమ కళకళలాడుతుంది.
ఇదీ చూడండి: ఆ రాత్రి లవర్‌తో హృతిక్.. మాజీ భార్య చూస్తుండగానే..