తన సంగీతంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆస్కార్ అవార్డ్ గ్రహీత, ప్రముఖ సంగీత స్వరకర్త ఏఆర్ రెహమాన్ కుమారుడు ఏఆర్ అమీన్‌కు భారీ ప్రమాదం తప్పింది. మూడు రోజుల క్రితం తమిళనాడులో జరిగిన ఓ ప్రమాదంలో అమీన్ త్రుటిలో తప్పించుకున్నారు. అయితే ఇప్పటికీ ఆ భయం నుంచి కోలుకోలేకపోతున్నట్లు ఆయనే స్వయంగా ఓ సోషల్‌మీడియా ప్లాట్‌ఫాం ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. చెన్నైలో తాను ఓ సెట్లో పాట షూటింగ్ పాల్గొనగా ఈ ప్రమాదం జరిగినట్లు అమీన్ తెలిపారు. ప్రస్తుతం తాను సురక్షితంగా ఉన్నానని చెప్పారు. తనను కాపాడినందుకు దేవుడు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
"మూడు రోజుల క్రితం.. నేను ఓ సాంగ్ షూటింగ్లో పాల్గొన్నాను. ఆ సమయంలో నా దృష్టంతా కెమెరా పైనే ఉంది. అదే టైమ్‌లో నేను సెట్లో ఉండగానే.. లైటింగ్ కోసం అని క్రేన్‌కు ఉంచిన భారీ లైట్లు, మరికొన్ని వస్తువులు పైనుంచి కిందపడ్డాయి. నాకు కొన్ని అంగుళాల దూరంలో అవి పడ్డాయి. నేను కొన్ని సెకన్లు ఆలస్యం చేసినా సరే.. అవి నా తలపై పడేవి. దీంతో ఒక్కసారిగా మా బృందం అంతా షాకయ్యాం. నేను ఇప్పటికీ ఆ షాక్ నుంచి కోలుకోలేకపోతున్నాను. ఆ రోజు నన్ను కాపాడినందుకు దేవుడుకి, నా తల్లిదండ్రులు, నా కుటుంబసభ్యులకు, శ్రేయోభిలాషులకు, నా ఆధ్యాత్మిక గురువుకు కృతజ్ఞతలు."
-- ఏఆర్ అమీన్, ఏఆర్ రెహమాన్ కుమారుడు