ప్రతి తెలుగు వారి లోగిళ్లలో ఆమెకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. బుల్లితెరపై ఆమె కనిపిస్తే పెదవులపై చిరునవ్వు విరబూయాల్సిందే. ఎంత బాధలో ఉన్నా.. ఆమె వేసే చలోక్తులకు మనసు తేలిక కావాల్సిందే. వాక్చాతుర్యం, తెలుగు భాషలో పట్టు ఆమెను తెలుగు వారి మనసుల్లో స్థానం సంపాదించేలా చేశాయి. ఆమెనే యాంకర్ సుమ. వ్యాఖ్యాతగా ఆమె షో చేస్తే కాసుల వర్షం కురవాల్సిందే. గేమ్ షోస్ అయినా.. సినిమా ఆడియో ఫంక్షన్లైనా.. అందరినీ చాకచక్యంగా తన మాటలతో కట్టి పడేసే సత్తా సుమ సొంతం. కానీ ఇప్పుడు సుమ తీసుకున్న ఓ షాకింగ్ నిర్ణయం.. ప్రేక్షకులను ఆందోళనకు గురిచేస్తోంది.
వినోదాల సునామీకి విరామం.. స్టార్ యాంకర్ సుమ షాకింగ్ నిర్ణయం - యాంకర్ సుమ ఈటీవీ ప్రోగ్రాం
బుల్లితెర వినోదానికి కేరాఫ్ అడ్రస్ అయిన యాంకర్ సుమ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈటీవీలో ప్రసారమయ్యే ఓ ప్రోగ్రాంలో తన నిర్ణయాన్ని ప్రకటించారు.
ప్రముఖ టీవీ ఛానల్ ఈటీవీలో 'వేర్ ఈజ్ ది పార్టీ' అనే ప్రత్యేక పోగ్రాం డిసెంబర్ 31న ప్రసారం కానుంది. ఈ ప్రోగ్రానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఈ కార్యక్రమంలో సుమ పలువురు సెలెబ్రిటీలతో సందడి చేశారు. తర్వాత వారందరూ సుమకు శాలువా కప్పి సత్కరించారు. అనతరం మాట్లాడిన ఆమె తన షాకింగ్ నిర్ణయాన్ని ప్రకటించారు. "మలయాళీగా పుట్టిన నేను ఇక్కడ సెటిల్ అయ్యానంటే.. అది కేవలం తెలుగు వాళ్లు ఇచ్చిన అభిమానం, ప్రేమ. వాళ్లు లేకపోతే నేను లేను. ఇది మాత్రం రాసిపెట్టుకోండి. కానీ కొంత విరామం అయితే తీసుకోవాలనుకుంటున్నాను" అని తెలిపారు. అయితే ఇంతకుముందు కూడా ఆమె కొన్ని సమస్యల కారణంగా.. ఈటీవీలో ప్రసారమయ్యే స్టార్ మహిళ ప్రోగ్రాం నుంచి తప్పుకున్నారు.