Akash puri Chorbazaar: యువహీరో ఆకాష్ పూరి, గెహనా సిప్పీ జంటగా నటించిన 'చోర్ బజార్' సినిమా ఈనెల 24న విడుదలవుతున్న సందర్భంగా చిత్ర విశేషాలను తెలిపారు దర్శకుడు జీవన్‌రెడ్డి. పూర్తి వినోదాత్మకంగా చిత్రం రూపొందిందని అన్నారు.
"నా గత సినిమాలు 'దళం', 'జార్జ్ రెడ్డి'కి భిన్నంగా పూర్తి వినోదాత్మకంగా రూపొందించిన చిత్రమిది. నేను చోర్‌బజార్‌కు వెళ్తుండేవాడిని. అక్కడి మనుషుల స్వభావం ఆకట్టుకుంది. వాళ్లు వస్తువులు దొంగతనం చేయరు. మనం వద్దనుకొని పడేసిన వస్తువుల్ని సేకరించి, అక్కడ తక్కువ ధరలకు అమ్ముతుంటారు. ఇలాంటి అంశాలన్నింటినీ ఈ చిత్రంలో ప్రస్తావించాం. సినిమాని 35రోజులు రాత్రిపూట షూటింగ్ చేశాం. కానీ, తెరపై ప్రతి ఫ్రేమ్ కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. దానికి మా ఛాయాగ్రాహకుడు జగదీశ్ ప్రతిభే కారణం".
"సినిమా ప్రధానంగా ప్రేమకథే అయినా.. ఒక విలువైన వజ్రం చుట్టూ తిరుగుతుంది. కనిపించకుండా పోయిన రూ.100కోట్ల విలువైన వజ్రం చోర్‌బజార్‌లో ప్రత్యక్షమవుతుంది. అక్కడి వాళ్లకు దాని విలువ తెలియదు. పది రూపాయలకు అమ్మేస్తుంటారు. ఇలా వజ్రం చుట్టూ జరిగే డ్రామా నవ్వులు పూయిస్తుంటుంది. చోర్‌బజార్‌లో ప్రతిఒక్కరూ ఒక్కో హీరోను అభిమానిస్తారు. ఆ స్ఫూర్తితోనే మా చిత్రంలో హీరోకు బచ్చన్ సాబ్ అనే పేరు పెట్టాం. ఇందులో నాయిక పాత్రకు మాటలు రాకున్నా.. టెక్నాలజీ, సోషల్‌మీడియా ద్వారా మాట్లాడించాం".
"బచ్చన్ సాబ్ పాత్రకు ఆకాష్ వందశాతం న్యాయం చేశాడు. కెరీర్ లెక్కలు వేసుకోవడం నాకు రాదు. సినిమాలు లేకపోతే ఊరెళ్లి వ్యవసాయం చేసుకుంటా. ప్రతి చిత్రానికీ పూర్తి అంకిత భావంతో పనిచేస్తుంటా. త్వరలో ఓ ఆసక్తికర ప్రాజెక్ట్ ప్రకటించనున్నా" అని జీవన్‌రెడ్డి అన్నారు.