బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ 2లో ఫిబ్రవరి 2న పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఎప్పటి నుంచో దీని కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులు.. పవర్ ఎపిసోడ్ రిలీజ్‌తో సంబరాలు చేసుకున్నారు. అయితే ఈ ఎపిసోడ్ రిలీజ్‌తో ఆహా సబ్స్క్రిప్షన్స్ కూడా అమాంతం పెరిగిపోయినట్లు సమాచారం. ఒక్కసారిగా ఎంతో మంది ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ ఆహా మళ్లీ పాత సమస్యనే ఎదుర్కొందని తెలిసింది. యూజర్స్ భారీగా రావడంతో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మళ్లీ సర్వర్లు క్రాష్ అయ్యాయట. నిజానికి ఆహా ఈ సమస్యను మొదటగా ప్రభాస్ ఎపిస్టోడ్ స్ట్రీమింగ్ సమయంలోనే ఎదుర్కొంది. ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ మొదలైనప్పుడు ప్రభాస్ అభిమానుల తాకిడికి ఆహా యాప్ కొన్ని గంటల పాటు క్రాష్ అయింది. సర్వర్లు డౌన్ కావడంతో సేవలు నిలిచిపోయాయి. దీంతో అభిమానులు నిరాశ కూడా చెందారు. అసంతృప్తి వ్యక్తం చేశారు.
అయితే మళ్లీ ఈ సమస్య రాకూడదని ఆహా ప్రత్యక జాగ్రత్తలు తీసుకుంది. ఈ ఎపిసోడ్ రిలీజ్ సమయంలో ఇదే జరుగుతుందని ఊహించిన టీమ్ ముందు జాగ్రత్త చర్యగా కొన్ని బ్యాకప్ సర్వర్స్‌ను కూడా ఇన్‌స్టాల్ చేసినట్లు సమాచారం. అలాగే పవన్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ ప్రారంభమైన తర్వాత ప్లాట్‌ఫామ్ స్థిరత్వాన్ని పర్యవేక్షించేందుకు ఫోకస్ టీమ్స్ కూడా ఏర్పాటు చేసినట్లు తెలిసింది. అయితే ఈ చర్యలు కొంతమేరకే పనిచేశాయట. అలా పవన్ ఫ్యాన్స్ తాకిడికి ఆహా సర్వర్లు కాస్త డౌన్ అయ్యాయట. ఏదేమైనప్పటికీ మునుపటితో పోలిస్తే ఈ సారి తక్కువ స్థాయిలోనే క్రాష్ అయినట్లు సమాచారం.