తెలంగాణ

telangana

ETV Bharat / elections

భారత్​ తీర్పు: పనిచేయని ప్రియాంక మ్యాజిక్​​

నానమ్మ పోలికలతో ఉన్న కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని  ప్రయోగించడంలో  కాంగ్రెస్​ విఫలమయిందా? అంటే ఫలితాలను చూస్తే అవుననే అనిపిస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో చివరి అస్త్రంగా ప్రియాంకను క్రియాశీల రాజకీయాల్లోకి ఆహ్వానించారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. అయితే యూపీలో ఘోర పరాభవంతో ఈ ప్రయోగం ఫలించలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.

By

Published : May 24, 2019, 8:23 AM IST

Updated : May 24, 2019, 10:58 AM IST

ప్రియాంక

పనిచేయని ప్రియాంక మ్యాజిక్​​

ఉత్తరప్రదేశ్​లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్​ అనేక వ్యూహాలు రచించింది. అందులో కీలకమైనది క్రియాశీల రాజకీయాల్లోకి ప్రియాంక గాంధీని తీసుకురావడం. అయితే ఫలితాలను పరిశీలిస్తే ఈ వ్యూహం ఫలించలేదని అర్థమవుతోంది. ఉత్తరప్రదేశ్​లో ఆ పార్టీ ఘోర ఓటమిని చవిచూసింది. అమేఠీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ పరాజయంతో మరింత కుంగిపోయింది హస్తం పార్టీ.

వచ్చీరాగానే దూకుడు

తూర్పు ఉత్తరప్రదేశ్​ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంకను జనవరిలో నియమించటం కాంగ్రెస్​కు ఎంతో బలమని అందరూ భావించారు. మొదటి నుంచి దూకుడుగా వ్యవహరించిన ప్రియాంక.. కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపారు. ప్రధాని నరేంద్రమోదీ విధానాలపై ఆమె చేసిన విమర్శలు, వ్యంగ్యాస్త్రాలతో కాంగ్రెస్​లో విశ్వాసం పెరిగింది.

ప్రచారంలోనూ హుషారుగా పాల్గొన్నారు ప్రియాంక. పంజాబీలో మాట్లాడటం, దిల్లీ బిడ్డనని చెప్పుకోవటం, రోడ్డుపై ఆగి మోదీ మద్దతుదారులతో మాట్లాడటం.. ఇలా సాగింది ప్రియాంక ప్రచార పర్వం. వీటిని ఓట్లుగా మలుచుకోవటంలో మాత్రం విఫలమయింది కాంగ్రెస్. భాజపా ప్రభంజనంతో 2022 జరగబోయే శాసనసభ ఎన్నికల్లోనూ పుంజుకోవటం అనుమానంగానే కనిపిస్తోంది.

తప్పిదాలే ముప్పు

వ్యూహాలను అమలు పరచటంలో ప్రియాంక గాంధీ కొంత విఫలమయ్యారు. యూపీలో ఎస్పీ-బీఎస్పీ పొత్తుకు బహిరంగ మద్దతు ప్రకటనతో సొంత కార్యకర్తలే అయోమయంలో పడ్డారు. ఈ ప్రకటనతో ప్రియాంక రాజకీయ అనుభవలేమి స్పష్టంగా కనిపించింది. ఆలస్యంగా రంగంలోకి దిగడమూ ఓ ప్రతికూలాంశమే. ఉత్తరప్రదేశ్​పైనే ఎక్కువగా దృష్టి సారించి, మిగిలిన రాష్ట్రాలను నిర్లక్ష్యం చేయడం కాంగ్రెస్​ను దెబ్బతీసింది.

వారణాసిలో మోదీపై ప్రియాంక పోటీ చేస్తారన్న ప్రచారమూ కాంగ్రెస్​కు నష్టం కలిగించింది. "ఈ విషయాన్ని ప్రియాంక ముందే ఖండిస్తే సరిపోయేది. ప్రజల్లోకి వెళ్లాక వెనక్కితగ్గి మోదీకి భయపడతున్నారనే భావన కలిగింది."అనేది విశ్లేషకుల వివరణ.

మోదీ ప్రభంజనం

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పోలికలతో ఉన్న ప్రియాంక.. ప్రజల్ని ఆకర్షించినా ఓట్లను రాబట్టలేకపోయారు. మోదీ ప్రభంజనాన్ని అడ్డుకోవాలని ఎన్డీఏయేతర పార్టీలు ప్రయత్నించినా.. ఐక్యత లోపించిందనేది స్పష్టం. భాజపా సునామీ ముందు ప్రియాంక ప్రసంగాలు, పర్యటనలు ఎలాంటి ప్రభావం చూపలేకపోయాయి.

ఇదీ చూడండి: 'ప్రియాంకను చూస్తే ఇందిర గుర్తొచ్చారు'

Last Updated : May 24, 2019, 10:58 AM IST

ABOUT THE AUTHOR

...view details