తమిళనాట దశాబ్దాలుగా అన్నాడీఎంకే, డీఎంకే పార్టీల మధ్యే పోటీ. రాష్ట్ర రాజకీయాలపై ద్రవిడ దిగ్గజాలు జయలలిత, కరుణానిధిది చెరగని ముద్ర. వీరిద్దరి అస్తమయం తర్వాత ఆ స్థాయి నాయకులెవరన్నది ప్రశ్నగానే మిగిలింది.
"అమ్మ మమ్మల్ని ముందుకు నడిపించారు. 47 ఏళ్ల ఆమె రాజకీయ జీవితంలో 27 ఏళ్లు అన్నాడీఎంకేను అధికారంలో కూర్చోబెట్టారు."
-ఆర్ఎం బాబు మురుగవేల్, అన్నాడీఎంకే అధికార ప్రతినిధి
"కరుణానిధి మరణం మానసికంగా ఎంతో నష్టం. కానీ ప్రజాస్వామ్య విధులు నిర్వహించటం పార్టీ కార్యకర్తలుగా మా ముందున్న బాధ్యత."
-కేఎస్ రాధాకృష్ణన్, డీఎంకే సీనియర్ నేత
2014 పరిస్థితులకు భిన్నంగా?
గత లోక్‌సభ ఎన్నికల్లో 39 స్థానాల్లో 37 గెలుచుకుంది అన్నాడీఎంకే. భాజపా, పీఎంకే చెరొకటి గెలిచాయి. ఈ పార్టీలన్నీ ఎన్డీఏ భాగస్వాములే. డీఎంకే సహా యూపీఏలో ఏ పార్టీ ఒక్క సీటైనా గెలుచుకోలేక చతికిలబడ్డాయి.
ఇప్పుడు తిరిగి పుంజుకునేందుకు స్టాలిన్ సేనకు ఒకేసారి 2 అవకాశాలు వచ్చాయి. ఏప్రిల్ 18న లోక్‌సభతో పాటు 18 శాసనసభ స్థానాలకు ఉపఎన్నికలు జరగున్నాయి. వీటిని కైవసం చేసుకోగలిగితే డీఎంకేకు చెన్నై పీఠం దక్కడం ఖాయమే. ఈ ఎన్నికల ఫలితాలు 2021 అసెంబ్లీ సమరానికి ముందు ప్రధాన పార్టీలకు అగ్నిపరీక్షే.
జయలలిత, కరుణానిధి లేకుండా జరుగుతున్న మొదటి సార్వత్రిక ఎన్నికల్లో ఆ స్థాయి వ్యూహాలు, ప్రచారం ఎక్కడా కనిపించటం లేదు. అయినా... విజయంపై ధీమాగా ఉన్నాయి రెండు ప్రధాన పార్టీలు.