దేశద్రోహం చట్టం రద్దు, సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం సవరణ, ఆర్టికల్ 370... ఇలా ఎన్నో అంశాలపై భాజపా, కాంగ్రెస్‌లవి భిన్నాభిప్రాయాలు. అదే విషయం ఆయా పార్టీల మేనిఫెస్టోల్లోనూ కనిపించింది. విజయమే లక్ష్యంగా రెండు పార్టీలు విడుదల చేసిన ఎన్నికల ప్రణాళికల్లోని కీలకాంశాలు మీ కోసం ఒకేచోట....
జాతీయ భద్రత
- కాంగ్రెస్: రక్షణ రంగానికి నిధుల పెంపు. దేశీయంగా ఆయుధాలు, యంత్రాల తయారీ సామర్థ్యాన్ని మెరుగుపరచటం
- భాజపా: సాయుధ బలగాలకు ఆధునిక ఆయుధాలు, యంత్రాల సమీకరణ. రక్షణ బాధ్యతల్లో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ
ఉద్యోగ కల్పన
- కాంగ్రెస్: కేంద్ర, రాష్ట్రాల్లో 2020 మార్చ్‌లోపు 34 లక్షల ఉద్యోగాల భర్తీ
- భాజపా: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు. ఈశాన్య రాష్ట్రాల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహ పథకం
రైతులు-పేదరికం
- కాంగ్రెస్: దేశంలోని 25 కోట్ల పేద కుటుంబాలకు న్యాయ్ ద్వారా ఏటా రూ. 72వేల జీవన భృతి. రైతులకు ప్రత్యేక బడ్జెట్
- భాజపా: 2022 నాటికి రైతులకు ఆదాయం రెట్టింపు. 60 ఏళ్లు దాటిన చిన్న, సన్నకారు రైతులకు పింఛను. రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా వడ్డీ లేని రుణాలు.
పౌరసత్వ సవరణ బిల్లు
- కాంగ్రెస్: పౌరసత్వ సవరణ బిల్లు రద్దు. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా
- భాజపా: అసోంలో పూర్తి స్థాయి ఎన్ఆర్సీ అమలు తర్వాత నెమ్మదిగా అన్ని రాష్ట్రాలకు వర్తింపు
భారత్-కశ్మీర్ సంబంధాలు
- కాంగ్రెస్: జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే రాజ్యాంగంలోని 370 ఆర్టికల్ యథాతథం
- భాజపా: రాజ్యాంగంలోని 370 ఆర్టికల్తో పాటు 35 (ఏ) రద్దు