వామపక్షాలు ఓట్ల వేటలో నానాటికీ వెనకబడుతూనే ఉన్నాయి. తాజా ఎన్నికల ఫలితాలు ఆ పక్షాలకు మరింత చేదు అనుభవాన్నే మిగిల్చాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దెబ్బతిన్నాయి.
1952 తర్వాత మళ్లీ ఇప్పుడే...
పదిలోపు లోక్‌సభ స్థానాలకు వామపక్షాలు పరిమితమవడం 1952 తరువాత ఇదే మొదటిసారి. 2014లో 12 సీట్లతో వామపక్షాలు సరిపెట్టుకున్నాయి. 2009లో 24 స్థానాలు, 2004లో అత్యధికంగా 59 స్థానాల్లో వామపక్షాల అభ్యర్థులు గెలిచారు. తాజా ఎన్నికల్లో ఒకానొక దశలో 6 చోట్ల ఆధిక్యంలో ఉన్న వామపక్షాలు.. చివరకు రెండంటే రెండు స్థానాలతో సరిపెట్టుకున్నాయి. ఆ రెండు స్థానాలూ కేరళలోనివే. బంగాల్లో 34 ఏళ్ల పాటు ఎలాంటి అడ్డకుంలు లేకుండా గెలిచిన వామపక్షాలు.. 2014లో రెండు లోక్‌సభ స్థానాల్లో మాత్రమే గెలిచాయి. ప్రస్తుత ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో ఏ ఒక్క స్థానాన్నీ కైవసం చేసుకోలేకపోయాయి.
ఒకప్పటి కింగ్‌మేకర్
సీపీఐ, సీపీఎం, అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్, సీపీఐ ఎంల్ పార్టీలు 1990 వ దశకం నుంచి 2000 దశకం ప్రారంభం వరకూ స్వర్ణయుగాన్ని చూశాయి. ఈ సమయంలో మూడు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు, 55-60 పార్లమెంట్ సీట్లు ఉండేవి వామపక్షాలకు. 1996-98 మధ్య కాలంలో ఏర్పాటైన మూడో ఫ్రంట్ ప్రభుత్వానికి సహకరించే స్థితిలో ఉండేవి.
తగ్గిన ఓటు శాతం
2011లో బంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ చేతిలో ఓటమి, 2018లో త్రిపురలో పరాభవం వామపక్షాలను మరింత దెబ్బతీశాయి. తాజాగా కేరళలోని లోక్‌సభ స్థానాల్లోనూ లెఫ్ట్‌పార్టీలు బలహీనపడ్డాయి. 2014లో బంగాల్లో 23శాతంగా ఉన్న వామపక్ష ఓటుబ్యాంకు.. ఈ అయిదేళ్ల కాలంలో 18 శాతానికి దిగజారింది. ఇదే సమయంలో 17.2 గా ఉన్న భాజపా ఓటు శాతం 40.1కి ఎగబాకింది. తృణమూల్ కాంగ్రెస్ ఓటుశాతం 39.7 నుంచి 43.5 కు పెరిగింది.