Young Woman 3 Marriages: ఏపీ నంద్యాల జిల్లా నంద్యాల మండలం మిట్నాల గ్రామానికి చెందిన 24 ఏళ్ల వయసున్న యువతి మూడు పెళ్లిళ్లు చేసుకుంది. ఎవరికీ విడాకులు కూడా ఇవ్వలేదు. బాధితుల్లో ఒకరు పోలీసులను ఆశ్రయించడంతో ఆమె వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఎస్సై శ్రీనివాసులు తెలిపిన ప్రకారం... మిట్నాలకు చెందిన మేరీ జసింట అలియాస్ మేరమ్మ కూతురు శిరీషకు గతంలో అవుకు మండలం చెన్నంపల్లెకు చెందిన పాణ్యం మల్లికార్జునతో మొదటి వివాహమైంది.
ఆయనతో విడాకులు తీసుకోకముందే ఆత్మకూరు మండలం కొత్తపల్లెకి చెందిన శ్రీనివాసరెడ్డిని రెండో పెళ్లి చేసుకుంది. రెండో భర్తతో విడాకులు పొందకముందే బేతంచెర్ల మండలం ఆర్‌ఎస్ రంగాపురం వాసి మహేశ్వరరెడ్డిని మనువాడేందుకు నిర్ణయించుకుంది. ఆయనకు కూడా రెండో వివాహం కావడంతో... తనకు రక్షణగా రూ.5 లక్షలు డిపాజిట్ చేయాలని షరతు విధించింది. ఆయన ఫిబ్రవరి 1న రూ.5 లక్షలు డిపాజిట్ చేయగా... ఫిబ్రవరి 5న మద్దిలేటి స్వామి ఆలయంలో వివాహమైంది. అయితే శిరీష తల్లి మేరమ్మ తరచూ ఆర్‌ఎస్ రంగాపురం వస్తూ... తన కూతురును అత్తారింట్లో ఉంచాలంటే మరిన్ని డబ్బులు, కొంత ఆస్తి రాసివ్వాలని డిమాండు చేయడం ప్రారంభించింది. అనుమానం వచ్చిన మహేశ్వరరెడ్డి... శిరీష గురించి విచారించగా ఆమెకు ఇప్పటికే రెండు వివాహాలు జరిగినట్లు తెలుసుకొని అవాక్కయ్యారు. వెంటనే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.