మెదక్ జిల్లా తూప్రాన్ మండలం స్థానిక ఎస్‌ఐ సురేశ్‌కుమార్ తెలిపిన వివరాలు.. వెంకటాయపల్లికి చెందిన లంబ మల్లయ్య, లక్ష్మి దంపతులకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కుమారుడు సత్యనారాయణ (27)కు మనోహరాబాద్ మండలం తుపాకులపల్లికి చెందిన భాగ్యతో రెండేళ్ల క్రితం వివాహం అవగా వారికి ఏడాది వయసున్న కుమార్తె అనన్య ఉంది. వ్యవసాయంతో పాటు కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
ఈ నేపథ్యంలో అతని వద్ద గ్రామానికి చెందిన నాగరాజు, రమేశ్‌లు అప్పుగా కొంత నగదు తీసుకున్నారు. మరికొంతమందికి మధ్యవర్తిగా ఉండి అప్పు ఇప్పించాడు. నాగరాజు, రమేశ్‌లు తీసుకున్న నగదు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇదే విషయంపై నాగరాజును గట్టిగా నిలదీయగా ఏం చేసుకుంటావో చేసుకో అంటూ బెదిరించాడు. అందుకు తోడు మధ్యవర్తిగా ఉండి అప్పు తీసుకున్న వారు సైతం తిరిగి చెల్లించలేదు. దీంతో ఓ వైపు నగదు ఇచ్చిన వారు, కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి పెరిగింది. భార్య భాగ్యతో పాటు అత్తింటి వారు సైతం ఇబ్బంది పెట్టడంతో మనస్తాపం చెందిన సత్యనారాయణ మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి మల్లయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ వివరించారు. ఒక్కగానొక్క కొడుకు మృతితో మాకెవ్వరు దిక్కంటూ తల్లిదండ్రులు రోదించడం అందరినీ కలచివేసింది.
అమ్మానాన్న చల్లగా బతకండి..