Young Man Carrying Deceased On His Shoulder: ఎవరైనా చనిపోతే ఆ వ్యక్తిని శ్మశానికి తీసుకువెళ్లడానికి ఏం చేస్తాం. నలుగురు వ్యక్తులు ఆ చనిపోయిన వ్యక్తిని కాటికి మోసుకొని వెళతారు.. లేకపోతే అంతిమయాత్ర వాహనంలో తీసుకువెళతాము. ఇంకా చెప్పాలంటే అటవీ ప్రాంతాల్లో అయితే మోసుకొని వెళతారు. ఇదే కదా మనం ఎక్కడైనా చూసేది.. అందుకు భిన్నంగా జరిగితే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి.. చనిపోయిన వ్యక్తిని ఇంకో వ్యక్తి భుజాలపై మోసుకొని పరిగెత్తుకుంటూ వెళితే.. వెనుక పోలీసులు వెంబడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేపింది.
జిల్లాలోని తంగళ్లపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన జడల మల్లయ్య (65) అనే వ్యక్తి శుక్రవారం తెల్లవారుజామున తన ఇంట్లో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఉదయం అంత్యక్రియలు చేయడానికి సిద్ధమయ్యారు. అంతలోనే.. ఓ గుర్తుతెలియని వ్యక్తి ఇచ్చిన సమాచారంతో పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. మల్లయ్య మృతిపై అనుమానాలున్నాయని... మృతదేహాన్ని శవపరీక్ష కోసం సిరిసిల్లకు తరలించాలని సూచించారు. అందుకు మల్లయ్య కుటుంబసభ్యులు నిరాకరించారు.
తమకు మృతిపై అనుమానాలు లేవని గుండెపోటుతోనే చనిపోయాడని వాదించారు. అంత్యక్రియలు నిర్వహించుకుంటామని తెలిపారు. అయితే పోలీసులు అందుకు అంగీకరించలేదు. ఓవైపు ఈ తంతంగం జరుగుతున్న సమయంలోనే మల్లయ్య సోదరుడి కుమారుడు రాజు మృతదేహాన్ని భుజంపై వేసుకుని శ్మశానవాటిక వైపు పరుగులు తీశాడు.