మానవత్వాన్ని మరిచిపోయిన తమ్ముడు సొంత అన్ననే దారుణంగా హతమార్చాడు. భూ వివాదంలో ఘర్షణ పడిన తమ్ముడు బంధాన్ని కాదని బరి తెగించాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం కేంద్రంలో జరిగింది. చిన్నప్పటి నుంచి ఒకే కుటుంబంలో పెరిగిన అన్నదమ్ములు ఓ చిన్న భూ తగాదా వారి మధ్య బంధాన్ని చెరిపేసింది.
మండల కేంద్రానికి చెందిన బిక్కి ఉప్పలయ్య(40) కల్లు గీత కార్మికుడిగా పనిచేస్తూ, వ్యవసాయ పనులు చేసుకుంటున్నాడు. కొన్నేళ్లుగా తన తమ్ముడు బిక్కి వెంకన్నకు, అతనికి భూ తగాదాలున్నాయి. ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం వ్యవసాయ భూమిలోని చెట్ల విషయంలో ఇద్దరి మధ్య ఏర్పడిన ఘర్షణ హత్యకు దారితీసింది.
మాటు వేసి.. గొడ్డలితో నరికి
నిన్న జరిగిన ఘర్షణ మనసులో పెట్టుకున్న బిక్కి వెంకన్న ఈ రోజు ఉదయం కల్లు గీసేందుకు వెళ్లిన ఉప్పలయ్యను పథకం ప్రకారం తన అనుచరులతో కలిసి మాటు వేసి దారుణంగా నరికి చంపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తుంగతుర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. భార్య వెంకటమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రవి వెల్లడించారు.
నిందితుడు అరెస్ట్
ఈ కేసులో ప్రధాన నిందితుడైన తమ్ముడు వెంకన్నను స్థానికుల సహకారంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో తానే గొడ్డలితో నరికి చంపినట్లు... పోలీసుల దర్యాప్తులో అంగీకరించాడు. హత్యకు సహకరించిన మరి కొందరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి : షేక్‌పేటలో విషాదఛాయలు.. స్వస్థలానికి అరకు మృతదేహాలు