నేను చేసిన తప్పేమిటి.. నేనుండగా మరొకరితో వివాహానికి సిద్ధపడడమేమిటి.. నా భర్తకు నచ్చజెప్పాల్సిన అత్తమామలు నన్నే ఇబ్బందులు పెట్టడమేమిటి.. అంటూ తీవ్ర మనస్తాపానికి గురైన ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని ఎ.రావివలసలో చోటుచేసుకుంది. ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నా.. మానసిక వేదనతో రమాదేవి(21) ఆత్మహత్య చేసుకోవడంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది.
కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
నాలుగేళ్ల క్రితం ఇదే మండలం దల్లిపేటకు చెందిన రమాదేవికి ఎ.రావివలసకు చెందిన వెంపాడ రాములబంగారితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు.. మూడేళ్ల కౌశిక, తొమ్మిదినెలల వాయిత్ ఉన్నారు. పెళ్లయిన రెండేళ్ల వరకు వీరి సంసారం అన్యోన్యంగా సాగినా.. ఆ తరువాత మనస్పర్ధలు రావడంతో చిన్నచిన్న గొడవలు మొదలయ్యాయి. దీనికితోడు కొడుకు మాటలు విని తల్లిదండ్రులు అప్పలనర్సమ్మ, రమణ కూడా రమాదేవిని మానసిక వేధింపులకు గురిచేసేవారు.
కుమారుడికి రెండో వివాహం చేస్తాం.. విడాకులు ఇవ్వు.. కాగితంపై సంతకం పెట్టాలంటూ వారు ఒత్తిడి చేసేవారు. ఇదే విషయమై కుటుంబంలో తగాదాలు జరుగుతుండేవి. దీనిపై 15 రోజుల క్రితం పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగింది. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన రమాదేవి.. సోమవారం అర్ధరాత్రి ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్యహత్య చేసుకుంది. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ మహేష్, తహసీల్దారు రాజేశ్వరరావు గ్రామానికి చేరుకొని, సర్పంచి శివారెడ్డితో కలసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై రమాదేవి తండ్రి రమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:ప్రేమించుకుని వెళ్లిపోయారు.. ఆ తర్వాత..?