తెలంగాణ

telangana

ETV Bharat / crime

Cheating: 'హలో మీకు బహుమతి వచ్చింది'.. ఇలాంటివి నమ్మారో ఇక అంతే!!

Cheating: హలో మీకు బహుమతి వచ్చింది.. సతీసమేతంగా వచ్చి అందుకోండి అంటూ ఫోన్లు చేస్తారు.. తీరా కార్యాలయానికి వెళ్లిన తర్వాత రూ.500 కూడా విలువ చేయని బహుమతిని చేతిలో పెట్టి మాయలో పడేసి సభ్యత్వం తీసుకుంటే విహారయాత్రల్లో రాయితీలు, శివార్లలో భూముల రిజిస్ట్రేషన్‌, వ్యాయామశాలల్లో ప్రవేశాలు ఇలా ఎన్నో మాయమాటలు చెప్పి బుట్టలో పడేస్తారు. గత కొంత కాలంగా బేగంపేట్‌లోని కంట్రీ వేకేషన్స్‌ మోసాల తీరు ఇది.

Cheating
Cheating

By

Published : Jun 7, 2022, 11:48 AM IST

Cheating: ఊరికే లాభాలొస్తున్నాయని భ్రమలో పడితే రూ.50వేల నుంచి రూ.1.5లక్షల వరకు లాగేస్తారు. తీరా చూస్తే నెలలు గడుస్తున్నా సభ్యత్వం ఉండదు.. విహారయాత్రల ఊసే ఉండదు.. శివార్లలో భూములు చూపించమంటే మొహం చాటేస్తారు.. చివరికి మోసపోయామని గ్రహించి లబోదిబోమంటారు. గత కొంత కాలంగా బేగంపేట్‌లోని కంట్రీ వేకేషన్స్‌ మోసాల తీరు ఇది. ఇన్ని జరుగుతున్నా... హైదరాబాద్‌, రంగారెడ్డి, రాష్ట్ర వినియోగదారుల కోర్టులను బాధితులు ఆశ్రయిస్తున్నా ఈ మోసాలకు అడ్డుకట్ట పడటం లేదు.

తాజా తీర్పులివీ..

జగద్గిరిగుట్టకు చెందిన జి.ప్రసాద్‌ కంట్రీ వెకేషన్స్‌ అనైతిక వ్యాపారంపై జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. రూ.2.4లక్షలు డిపాజిట్‌ చేస్తే సభ్యత్వం కల్పించడంతోపాటు జనగామలో 300 గజాల ప్లాట్‌ ఇస్తామంటూ ప్రతివాద కంట్రీవెకేషన్స్‌ ఓ బ్రోచర్‌ను రిలీజ్‌ చేసింది. ఈ క్రమంలోనే 2019 మే 25న ఫిర్యాదీ నంబర్‌కు కాల్‌ చేసి రూ.25వేల విలువైన గిఫ్ట్‌ వచ్చిందంటూ కుటుంబంతో కలిసి వచ్చి తీసుకోవాలంటూ అభ్యర్థించారు. దీంతో ప్రసాద్‌ తర్వాతి రోజున బేగంపేట్‌లోని కార్యాలయానికి చేరుకున్నారు.

జీవిత కాల సభ్యత్వం ఉందంటూ రూ.65వేలు చెల్లించాలని అనేక సదుపాయాలు కల్పిస్తామంటూ చెప్పడంతోపాటు జనగాం, యాదగిరిగుట్టలో 300 గజాల స్థలం వస్తుందని చెప్పడంతో ప్రసాద్‌ రూ.2.4 లక్షలు చెల్లించారు. అనంతరం ప్రతివాద సంస్థ ప్లాట్‌ రిజిస్టర్‌ చేస్తామంటూ మభ్యపెడుతూ కొంతకాలం నెట్టుకొచ్చినా చివరికి తన డబ్బు రీఫండ్‌ చేయాలంటూ తిరగబడటంతో ప్రతివాద సంస్థ సిబ్బంది స్పందించడం మానేశారు. దీంతో ఫిర్యాదీ జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. విచారించిన కమిషన్‌-3 బెంచ్‌ రూ.2.4 లక్షలు 12శాతం వడ్డీతో చెల్లించడంతోపాటు, పరిహారం రూ.20వేలు, కేసు ఖర్చులు రూ.5వేలు, 45 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించింది.

*అంబర్‌పేట్‌కు చెందిన సింగీతం బాల్‌రాజ్‌దీ ఇదే పరిస్థితి.. 2009లో రూ.25వేల విలువైన బహుమతి వచ్చిందంటూ కార్యాలయానికి పిలిపించుకుని శాశ్వత సభ్యత్వం పేరుతో రూ.55వేలు చెల్లించాలంటూ..జనగామ జిల్లాలో 300 గజాల స్థలం వస్తుందంటూ ఆశపెట్టడంతో ఫిర్యాదీ రూ.1,10,000 చెల్లించారు. చివరికి మోసపోయానని గ్రహించిన బాధితుడు కమిషన్‌ను ఆశ్రయించారు. విచారించిన బెంచ్‌ రూ.1,10,000, 12శాతం వడ్డీతో చెల్లించడంతో పాటు రూ.20వేలు పరిహారం, రూ.5వేలు కోర్టు ఖర్చులు, 45 రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది.

*కర్మన్‌ఘాట్‌ డిఫెన్స్‌ కాలనీకి చెందిన పోరెడ్డి వెంకట్‌ రవణమ్మకు 2019 జూన్‌ 6న ప్రతివాద సంస్థ నుంచి ఫోన్‌ వచ్చింది. వారి మాయమాటలకు మోసపోయి రూ.1,70,000 చెల్లించింది. ఈ క్రమంలో తనకు కోల్‌కతా నుంచి దిల్లీకి వెళ్లేందుకు అటు నుంచి ఆక్లాండ్‌ చేరుకునేందుకు టిక్కెట్‌ బుక్‌ చేయాలని చెప్పినా ప్రతివాద సంస్థ పెడచెవిన పెట్టింది. చివరికి తన డబ్బు రీఫండ్‌ చేయాలని కోరినా పట్టించుకోదు. వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించగా విచారించిన కమిషన్‌-3 బెంచ్‌ ఫిర్యాదీకి చెల్లించాల్సిన రూ.1.7లక్షలు 12శాతం వడ్డీతో, పరిహారం రూ.25వేలు, కేసు ఖర్చులు రూ.5వేలు, 45 రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details