పది రోజుల్లో వివాహం జరగాల్సిన ఆ ఇంట విషాదం నెలకొంది. కుమార్తె వివాహానికి బంగారం, నూతన వస్త్రాలు కొనేందుకు బయలుదేరిన ఆ కుటుంబం ఇంటికి తిరిగిరాలేదు. ఎన్నో ఆశలతో బిడ్డ పెళ్లి చేసేందుకు ఆరాటపడగా.. అంతలోనే కానరాని లోకాలకు వెళ్లిపోయారు. లారీ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు... పెళ్లిబాజాలతో మోగాల్సిన ఇంట్లో ఆర్తనాదాలను మిగిల్చింది.
కుటుంబ సభ్యులంతా కలిసి...
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం ఎర్రకుంట తండాకు చెందిన జాటోత్ కస్నా నాయక్.. కల్యాణి దంపతులకు ఇద్దరు కుమారులు.. ఓ కుమార్తె. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కుమార్తెను డిగ్రీ వరకూ చదివించారు. తమ గారాల పట్టికి డోర్నకల్ మండలానికి చెందిన యువకునితో పెళ్లి నిశ్చయించారు. ఫిబ్రవరి 10న ఉదయం తమ ఇంట జరగనున్న పెళ్లికోసం అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పెళ్లి పనుల్లో బీజీ అయ్యారు. పెళ్లి తేదీ దగ్గరపడింది. ఆభరణాలు, దుస్తులు కొనేందుకు ఓ ఆటో మాట్లాడుకుని పెండ్లి కుమార్తె ప్రమీల, తల్లి కల్యాణి, సోదరుడు ప్రదీప్, చిన్నమ్మ బాబాయ్ ప్రసాద్, లక్ష్మిలతో కలిసి వరంగల్‌కు బయలుదేరారు.
దూసుకొచ్చిన మృత్యువు
బిడ్డ పెళ్లి తలచుకుని ఆ తల్లి.. సోదరి మనువు ఎంతో వైభవంగా జరిపించాలని సోదరుడు.. అయినవాళ్ల ఇంట వివాహ వేడుకలో తామో చెయ్యివేస్తున్నామన్న ఆనందంలో ఉన్న బాబాయి పిన్ని.. ఎంతో ఉల్లాసంతో ప్రయాణిస్తున్నారు. ఇంటి నుంచి బయలు దేరి 20 నిమిషాలే గడిచింది. ఇంతలో దారికాచిన మృత్యువు లారీ రూపంలో దూసుకొచ్చింది. రెప్పపాటులో తమ ఆటోను ఢీకొని ఈడ్చుకుని పోయింది. ఏమైందో తెలుసుకునేలోగానే లారీ కింద నలిగిన వారి దేహాలు ఛిద్రమయ్యాయి. క్షణాల వ్యవధిలోనే ఆరుగురి ఊపిరి అనంత వాయువుల్లో కలిసిపోయింది. ఆటోలో చిక్కుకున్న మృతదేహాలను ప్రొక్లెయిన్ సహాయంతో బయటకు తీయాల్సి వచ్చిందంటే.. ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో అవగతమవుతోంది.
పెళ్లి వస్త్రాలు కొనేందుకు..