ఓ మనిషి చనిపోవటమనేది.. ఎంత కాదన్న బాధాకరమైన విషయం. శత్రువు చనిపోయినా.. మనసులో కొంచెమైనా బాధ కలగకమానదు. "మనిషి బతుకుకు ఎలాగూ విలువలేదు.. కనీసం చావునైనా గౌరవిద్దాం" అని ఓ సినిమాలో డైలాగ్ కూడా ఉంది. కానీ.. ఓ వెర్రి కారణం వారి చావుకు దారి తీసిందని తెలిసినప్పుడు.. బాధపడటం పక్కనబెట్టి సహజంగానే తిట్లదండకం అందుకోవటం సర్వసాధారణం. అయితే.. అచ్చం అలాంటి ఉదంతమే హైదరాబాద్‌లోని బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.
నిజాంపేటలోని వినాయక్‌నగర్‌లోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తోన్న లలిత(56)కు ఓ కూతురు, కుమారుడు. అయితే.. లలిత భర్త 12 ఏళ్ల క్రితమే కుటుంబాన్ని వదిలి వెళ్లిపోయాడు. కూతురు దివ్య(36)కు వివాహం చేయగా.. వాళ్ల మధ్య కలహాలతో 12 నెలల నుంచి భార్యభర్తలు విడిగా ఉంటున్నారు. దివ్యకు 18 నెలల బాబు ఉండగా విడిపోయినప్పటి నుంచి.. తల్లి, తమ్ముడితోనే కలిసి ఉంటోంది. ఇంటి భారం మొత్తం కుమారుడు శ్రీకరే చూసుకుంటున్నాడు. ఇంట్లో ఉన్న తల్లి, అక్కకు.. అండగా ఏ లోటు తెలియకుండా చూసుకుంటున్నాడు. వాళ్ల కోసం ఇంత చేస్తున్న శ్రీకర్‌కు ఇంకా పెళ్లి కాలేదు. ఇదే వాళ్ల అసలు సమస్య. శ్రీకర్‌కు పెళ్లి కావట్లేదని తరచూ బాధపడేవాళ్లు. ఆ బాధతో.. లలిత, దివ్య డిప్రెషన్లోకి వెళ్లిపోయారు.
ఇద్దరికి డిప్రెషన్ ఎక్కువైపోవటంతో.. ఈ సమస్యకు చావే పరిష్కారమని నిర్ణయించుకున్నారు. బుధవారం అర్ధరాత్రి 2 గంటలకు చనిపోయేందుకు నిశ్చయించుకున్నారు. తామిద్దరు చనిపోతే.. బాలుడు అనాధ అవుతాడని భావించారు. అందుకోసం వాళ్లు ఆత్మహత్య చేసుకునేందుకు ముందుగానే.. బాలున్ని ఈ లోకం నుంచి దూరం చేయాలనుకున్నారు. చిన్నారికి చున్నితో ఉరివేశారు. ప్రాణం పోయిందని నిర్ధరించుకున్నాక.. తల్లి లలిత ఉరేసుకుంది. ఆ తరువాత.. దివ్య కూడా ఉరేసుకుంది. ఈ క్రమంలో ఉరేసుకున్న చున్నీ తెగిపోవటంతో.. కొన ఊపిరితో దివ్య కిందపడింది.