మద్యం మత్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు హైదరాబాద్ కేపీహెచ్‌బీ పోలీస్స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై వీరంగం సృష్టించారు. టీఎస్ 09 ఈయూ 7477 నంబరు గల ఇన్నోవా కారులో ఇద్దరు వ్యక్తులు మద్యం సేవిస్తూ.. రహదారి పక్కనే సోడా విక్రయిస్తున్న బండి వద్ద కారును నిలిపారు.
మద్యం మత్తులో పోలీసు అధికారి కుమారుడి హల్‌చల్! - police officer son NEWS
కేపీహెచ్‌బీ ఠాణా పరిధిలో ఆదివారం రాత్రి ఇద్దరు యువకులు మద్యం మత్తులో హల్‌చల్ చేశారు. వీరిలో ఒకరు ఓ పోలీసు అధికారి కుమారుడు కాగా మరో యువకుడు వైద్యుడు. ఈ ఇద్దరూ పూటుగా మద్యం తాగి రహదారి పక్కన సోడాలు విక్రయిస్తున్న చిరు వ్యాపారితో వాగ్వాదానికి దిగారు.
సోడాలు విక్రయిస్తున్న చిరు వ్యాపారిని నీళ్లు అడిగారు. 'ఇక్కడ తాగొద్ధు. నా గిరాకీ దెబ్బతింటుంది వెళ్లిపోండి' అని చిరు వ్యాపారి చెప్పాడు. 'నేను ఎవరో తెలుసా? పోలీసు ఆఫీసర్‌ని' అని యువకుల్లో ఒకరు బెదిరించారు. అంతటితో ఆగకుండా సోడా బండి పడేశారు. కారుపై ముందు వెనక పోలీసు అని రాసి ఉంది. గొడవ జరిగిన సమయంలో కారు సైరన్ కూడా మోగించి హల్‌చల్ చేశారు.
దీంతో చిరు వ్యాపారి నువ్వు పోలీసు అధికారి అయితే నేను పోలీసులకు ఫోన్ చేస్తానని 100కి ఫోన్ చేశాడు. కేపీహెచ్‌బీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించగా మద్యం తాగినట్లు తేలింది. శ్రీనివాస్ అనే యువకుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. ఇతను ఏఆర్ విభాగంలో అదనపు ఎస్పీగా పనిచేస్తున్న పోలీసు అధికారి కుమారుడు. మరో యువకుడు అరుణ్ వైద్యుడు. ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.