పున్నామ నరకం నుంచి రక్షించేవాడే పుత్రుడని నానుడి. వృద్ధాప్యంలో కన్నుమూశాక.. తన చితికి కుమారుడే నిప్పు పెడతాడని భావించిన ఆ తల్లికి.. తీరని శోకం మిగిలింది. చేతికందొచ్చిన కొడుకు.. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటే ఆ తల్లే తలకొరివి పెట్టింది.
కడుపు కోత.. కుమారుడి చితికి తలకొరివి పెట్టిన తల్లి.! - nalgonda district news
ఆ తల్లికి ఇద్దరు కుమారులు. కొన్నేళ్ల క్రితమే భర్త చనిపోయినా పిల్లలున్నారని గుండె నిబ్బరం చేసుకుంది. బాధను దిగమింగుకుని వారిని పెంచి పెద్ద చేసింది. పెద్ద కుమారుడు చేతికందాక ఇంటి పెద్దగా బాధ్యతలు తీసుకుంటాడని సంబరపడింది. చిన్న కుమారుడు అన్నకు సాయంగా ఉంటాడని భావించింది. కానీ విధి వారి పట్ల చిన్నచూపు చూసింది. పాతికేళ్ల కుమారుడు కళ్లెదుటే విగతజీవిగా పడి ఉండటం చూసి ఆ తల్లి తట్టుకోలేకపోయింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో కన్న తల్లే కొడుక్కి చితి పెట్టాల్సి వచ్చంది. నల్గొండ జిల్లా ముప్పారం గ్రామంలో ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది.
నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ముప్పారం గ్రామానికి చెందిన గోగుల పద్మకు ఇద్దరు కుమారులు. పద్మ భర్త చాలా ఏళ్ల క్రితమే చనిపోయారు. కాయకష్టం చేసుకుంటూ ఇద్దరు పిల్లలను పెంచి పెద్ద చేసింది. భర్త చనిపోయి చాలా ఏళ్లు కావటంతో కుటుంబం దీనావస్థలో ఉంది. ఆర్థికంగా అండ లేకపోవడంతో కుటుంబంలో అప్పులు ఎక్కువయ్యాయి. అప్పులు ఎక్కువ కావడంతో మనస్తాపం చెందిన పెద్ద కుమారుడు వెంకటేష్(25).. నిన్న ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిన్న కుమారుడు తల కొరివి పెట్టకూడదని బంధువులు చెప్పడంతో.. బాధను దిగమింగుకుని వెంకటేష్ చితికి తల్లే కొరివి పెట్టింది. ఆ తల్లి బాధను చూసి బంధువులు, గ్రామస్థుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చదవండి:Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 220 కరోనా కేసులు, ఒకరు మృతి