రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఎన్‌ఎఫ్‌సీ కాలనీలో ఆరేళ్ల బాలుడి అదృశ్య ఘటన(Tragedy in Rajendra nagar) విషాదాంతమైంది. ఆడుకుంటానని చెప్పి గురువారం మధ్యాహ్నం ఇంట్లో నుంచి బయటకు వచ్చిన చిన్నారి... కుంటలో విగతజీవిగా(missing boy found dead) తేలాడు. ఈ ఘటనపై బాలుడి కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రమాదవశాత్తు జరిగిందని పోలీసులు చెబుతున్నారు.
ఏం జరిగింది?
కొండారెడ్డి అపార్ట్మెంట్లో నివసించే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి శివశంకర్ కుమారుడు ఆరేళ్ల అనీష్. ఆడుకుంటానని తల్లితో చెప్పి... గురువారం మధ్యాహ్నం పైఅంతస్తు నుంచి కిందకు వచ్చినట్లు బాధిత కుటుంబసభ్యులు తెలిపారు. ఎంతసేపటికీ చిన్నారి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు... చుట్టుపక్కల గాలించారు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు... బాలుడి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలించారు. శుక్రవారం ఉదయం కొండారెడ్డి అపార్ట్‌మెంట్ వెనుక వైపు ఉన్న ఓ కుంటలో బాలుడు శవమై(missing boy found dead) తేలాడు. చిన్నారిని ఎవరైనా అపహరించి హత్య చేశారా? లేక కుంటలో పడేశారా? అని కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
బాబు నిన్న మధ్యాహ్నం 1.30కి మిస్ అయ్యాడు. మిస్ అయినప్పటి నుంచి పోలీసు బృందాలు వెతకడం ప్రారంభించాయి. నిన్న ఎక్కడా కూడా ఆచూకీ దొరకలేదు. ఈరోజు ఉదయం ఇక్కడే వెనక ఉన్న చిన్న కుంటలో మృతదేహం దొరికింది. ఈత కోసం వెళ్లి... ఈతరాక చినిపోయినట్లు కనిపిస్తోంది.
-గంగాధర్, రాజేంద్రనగర్ ఏసీపీ
ఈత కోసం బాలుడే కుంటలోకి దిగి... మృతి చెంది ఉంటాడని పోలీసులు చెబుతున్నారు. ఈత కోసమే ముందుగా బట్టలు విప్పి నీటిలో దిగి ఉంటాడని అంటున్నారు. బాలుడి మృతదేహంపై బట్టలు లేకపోవడం, బట్టలు కుంట ఒడ్డున ఉండడంపై సందేహాలున్నాయని బాధిత కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై మరింత లోతుగా పోలీసులు విచారణ జరిపి వాస్తవాలు బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.