Shilpa Chowdary custody: అధిక వడ్డీల పేరుతో మోసానికి పాల్పడిన కేసులో నిందితురాలు శిల్ప చౌదరిని మొదటి రోజు ఆరు గంటల పాటు పోలీసులు విచారించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆమెను ప్రశ్నించారు. ఆమె బినామీలు, బ్యాంకు ఖాతాలపై లోతుగా ఆరా తీశారు. ఇప్పటి వరకు నమోదైన ఫిర్యాదులపై శిల్ప వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. కోట్ల రూపాయలను ఎక్కడికి తరలించిందనే కోణంలోనూ పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. రేపు మరోసారి నార్సింగ్ పోలీసులు ఆమెను విచారించనున్నారు. పోలీసుల విచారణలో ఆమె విలపించినట్లు సమాచారం.
పెట్టుబడుల పేరుతో మోసాలు
Shilpa Chowdary custody news : పెట్టుబడుల పేరుతో పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడిన మహిళ.. శిల్పా చౌదరిని నార్సింగి పోలీసులు రెండు రోజుల కస్టడీ తీసుకున్నారు. కోర్టు అనుమతితో శిల్పను విచారిస్తున్నారు. చంచల్గూడ మహిళా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న శిల్పకు ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నార్సింగి ఠాణాకు తీసుకెళ్లారు. శిల్ప ఎవరెవరి వద్ద నుంచి ఎంత సొమ్ము తీసుకుందనే ప్రశ్నించారు. డబ్బులు ఎక్కడకు మళ్లించారు.. బ్యాంకు ఖాతాలకు సంబంధించిన లావాదేవీలపైనా పోలీసులు లోతుగా ఆరా తీశారు. శిల్పా చౌదరిపై నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ముగ్గురు మహిళలు ఫిర్యాదు చేయగా.. రూ.7 కోట్ల 5లక్షలు తీసుకుందని పోలీసులు గుర్తించారు. ఫిర్యాదు చేసిన వాళ్లలో సినీ హీరో మహేశ్ బాబు సోదరి ప్రియదర్శిని ఉన్నారు. శిల్పకు రూ.2కోట్లకు పైగా ఇచ్చానని ప్రియదర్శిని తెలిపారు. డబ్బులు తీసుకున్న తర్వాత శిల్ప బ్యాంకు చెక్కులు ఇచ్చారని... అవి చెల్లకపోవడంతో బాధితులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లలోనూ కేసులు నమోదయ్యాయి. 7 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఉప్పర్‌పల్లి కోర్టును పోలీసులు కోరగా.. రెండు రోజులు విచారణ చేసేందుకు అనుమతిచ్చింది. శిల్పా ఓ చిన్న చిత్రాన్ని నిర్మించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇప్పటికే శిల్ప బ్యాంకు ఖాతాల వివరాలను పోలీసులు సేకరించారు.
కిట్టి పార్టీలతో ఆకట్టుకుంటూ..