Food poison in sports school: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలోని ట్రైబల్ వెల్ఫేర్ మోడల్ స్పోర్ట్స్ పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం భోజనంతో పాటు చికెన్ తిన్న విద్యార్థులు వాంతులు, విరోచనాలతో తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. వెంటనే స్పందించిన పాఠశాల యజమాన్యం వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వెళ్లి చికిత్స అందిస్తున్నారు. సుమారు 30 మంది వరకు అస్వస్థతకు గురైనట్లు తోటి విద్యార్థులు చెబుతున్నారు.
ఎమ్మెల్యే సీతక్క పరమార్శ:అస్వస్థతకు గురైన విద్యార్థులను ములుగు ఎమ్మెల్యే సీతక్క స్వయంగా వెళ్లి పరామర్శించారు. విద్యార్థులకు అందుతున్న వైద్యంపై డాక్టర్లతో మాట్లాడారు. అనంతరం హాస్టల్, డైనింగ్ హాల్ పరిసరాలు పరిశీలించి వారితో కలిసి భోజనం చేశారు. అనంతరం విద్యార్థులకు ధైర్యం చెప్పారు. ఈ ప్రాంతంలో ఎప్పుడు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదని.. ఈరోజు ఈ ఘటన చోటు చేసుకోవడం చాలా దురదృష్టకరమని ఆమె విచారం వ్యక్తం చేశారు.
హాస్టల్ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మంత్రి సత్యవతి రాథోడ్.. ఈ ఘటనపై వెంటనే స్పందించాలని అన్నారు. హాస్టల్ క్యాంటిన్ ఏజెన్సీ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరారు. వర్కర్స్ అంతా గత 25 రోజులుగా సమ్మె చేస్తుండటంతో.. ఉన్న తక్కువ మంది వర్కర్లు వంట చేయడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆమె విచారం వ్యక్తం చేశారు.