తెల్లవారితే రాఖీపౌర్ణమి. ఆ అక్క తన తమ్మునికి ఎంతో ప్రేమగా రాఖీ కట్టాలని అనుకుని ఉంటుంది. నువ్వే నాకు ఎల్లప్పుడు రక్షగా ఉండాలని తమ్ముని నుంచి హామీ తీసుకునే కొన్ని గంటల ముందు విషాదం చోటుచేసుకుంది. అక్కా తమ్ముడు కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తూ.. ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో అక్క అక్కడికక్కడే మృతి చెందగా...తమ్ముడు తీవ్రంగా గాయపడ్డాడు.
మేడ్చల్ జిల్లా బహదూర్ పల్లికి చెందిన విద్యార్థులు అక్క సిందూజ, తమ్ముడు సాయి... జిరాక్స్ కోసం దూలపల్లికి ద్విచక్రవాహనంపై వచ్చారు. పని ముగించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. దూలపల్లి ఫారెస్ట్ అకాడమీ వద్దకు రాగానే వెనక నుంచి ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అతివేగంగా దూసుకువచ్చింది. ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో సింధూజ తీవ్ర గాయాలపాలై అక్కడిక్కడే మృతి చెందింది. తమ్ముడు సాయికి తీవ్రగాయల పాలయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు... దర్యాప్తు చేస్తున్నారు. రాక్షాబంధన్ వేళ ఇలా జరగటంతో కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోధిస్తున్నారు.