Shadnagar road accident case update: 2021 డిసెంబర్లో షాద్‌నగర్ నియోజకవర్గం ఫరూక్నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామ శివారులో రోడ్డు ప్రమాదంలో భిక్షపతి అనే వ్యక్తి మృతి చెందాడు. అప్పుడు అనుమానాస్పద వాహనం ఢీకొని మృతి చెందినట్లు కేసు నమోదు చేశారు. భిక్షపతి పేరుపై హైదరాబాద్‌లో ఉన్న ఇల్లు దానిపై ఉన్న ఇన్సూరెన్స్ క్లైమ్ చేసేందుకు నామినిగా ఉన్న శ్రీకాంత్ కంపెనీకి వెళ్లాడు. క్లైమ్ దర్యాప్తులో ఇన్సూరెన్స్ కంపెనీ వారికి అనుమానం రావడంతో షాద్‌నగర్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో అనుమానంతో బోడ శ్రీకాంత్‌ను విచారించారు. విచారణలో గతంలో అతనిపై కేసులు ఉన్నట్లు గుర్తించారు. అతనే హత్య చేయించినట్లు గుర్తించారు. ఆయనతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేయగా.. వీరిలో ఎస్ఓటీ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న మోతిలాల్ కూడా ఉన్నాడు. కేసు దర్యాప్తులో పోలీసులకు విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం జల్లి గ్రామం బోడతండకు చెందిన ప్రధాన నిందితుడు బోడ శ్రీకాంత్... స్థిరాసి వ్యాపారం చేస్తూ కొంతకాలంగా నగరంలోని మేడిపల్లిలో నివాసం ఉంటున్నాడు. విలాసాలకు అలవాటు పడిన శ్రీకాంత్... బోగస్ కంపెనీల పేరుతో కొంత మంది ఉద్యోగుల పేర్లు చూపి బ్యాంకుల నుంచి క్రెడిట్ కార్డులు, లోన్లు తీసుకుని జల్సాలు చేసేవాడు. ఇదే క్రమంలో గతంలో రూ.1.5కోట్ల మోసం కేసులో నాచారం పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. తరువాత విడుదలైనా శ్రీకాంత్ తీరు మారలేదు. వ్యాపారం కూడా చేసే శ్రీకాంత్ వద్ద రెండేళ్ల క్రితం గుంటూరు జిల్లా నర్సంపేట మండలం గురజాలకు చెందిన భిక్షపతి అనే యువకుడు పనికి చేరాడు. ఆయనకి తల్లిదండ్రులెవరూ లేకపోవడంతో పనిలో చేరిన కొన్ని రోజులకే భిక్షపతి పేరుపై ఐసీఐసీఐ బ్యాంకులో రూ.50లక్షల విలువ చేసే ఇన్సూరెన్స్ పాలసీ చేయించాడు.