తెలంగాణ

telangana

ETV Bharat / crime

Rape case: గుంటూరు అత్యాచారం కేసు.. పోలీసుల అదుపులో ఏడుగురు! - తెలంగాణ వార్తలు

గుంటూరు జిల్లాలో జరిగిన మహిళపై సామూహిక అత్యాచారం కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఏడుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు... వారిని విచారిస్తున్నారు. గుంటూరు నగరానికి 28 కి.మీ దూరంలో ఈ నెల 8న రాత్రి 10 గంటల సమయంలో వివాహితపై ఆగంతుకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దోపిడీ దొంగల ముఠా తరహాలో దారికాసి అటకాయించిన దుండగులు.. ఆలుమగలిద్దరినీ తీవ్రంగా కొట్టి, చిత్రహింసలు పెట్టారు.

Rape case, police investigation on guntur rape case
గుంటూరు అత్యాచారం కేసు విచారణ, సామూహిక అత్యాచారం కేసు

By

Published : Sep 13, 2021, 3:08 PM IST

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో వివాహితపై సామూహిక అత్యాచారం(gang rape) కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ ఘటనలో కొర్రపాడుకు చెందిన అనుమానితులు ఏడుగురు పాత నేరస్థులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని విచారిస్తున్నారు.

అసలేం జరిగింది?

గుంటూరు నగరానికి 28 కి.మీ దూరంలో.. ఈ నెల 8న రాత్రి 10 గంటల సమయంలో వివాహితపై ఆగంతుకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దోపిడీ దొంగల ముఠా తరహాలో దారికాసి అటకాయించిన దుండగులు.. ఆలుమగలిద్దరినీ తీవ్రంగా కొట్టి, చిత్రహింసలు పెట్టారు. భర్తను కట్టేసి భార్యపై అఘాయిత్యానికి తెగబడ్డారు. వేటకొడవళ్లతో బెదిరించి నగలు, నగదు కూడా కాజేశారు. ఏపీ ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలోని సీతానగరం పుష్కరఘాట్‌ వద్ద మూడు నెలల కిందట జరిగిన సామూహిక అత్యాచార ఘటన మరువకముందే.. అదే తరహా దారుణం అదే జిల్లాలో చోటుచేసుకోవడం సంచలనంగా మారింది.

కర్ర అడ్డం పెట్టి.. కింద పడగొట్టి..

గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన దంపతులు (భార్య 26, భర్త 30 ఏళ్లు) మేడికొండూరు మండలం పాలడుగు గ్రామంలో ఓ శుభకార్యానికి బుధవారం హాజరయ్యారు. రాత్రి 9.45 గంటలకు స్వస్థలానికి బయల్దేరారు. 2.50 కి.మీ దూరం ప్రయాణించాక.. దారికి అడ్డంగా వేసి ఉన్న ఓ చెట్టు కొమ్మ ఎదురుపడింది. దానిపై నుంచే వాహనాన్ని ముందుకు పోనివ్వగా.. దుండగులు కర్ర అడ్డంపెట్టి బైక్‌ పైనుంచి వారిద్దరినీ కిందపడగొట్టారు. వెంటనే ఇద్దరిపై పిడిగుద్దులు కురిపించి తీవ్రంగా గాయపరిచారు. తర్వాత కొడవళ్లు చూపించి చంపేస్తామని బెదిరించారు. సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లారు. ఆ మార్గంలో వెళ్లేవారికి అనుమానం రాకుండా బాధితుల బైకును పొలాల్లోకి దించేశారు. బాధితురాలి భర్త బనియను, దుస్తుల్ని చించేసి వాటితోనే అతన్ని కట్టేశారు. అతని వద్ద ఇద్దరు దుండగులు కాపలా కాయగా, మరో ఇద్దరు బాధితురాలిని ఓ చెట్టు కిందకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఒకరి తర్వాత ఒకరు ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. రాత్రి 12.40 గంటల వరకూ భార్యాభర్తలిద్దరినీ చిత్రహింసలకు గురిచేశారు.

స్థానిక కూలీల విచారణ

ఘటనాస్థలికి అర కిలోమీటరు దూరంలో ఓ శీతల గిడ్డంగి నిర్మాణం జరుగుతోంది. ఒడిశా, శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారితో పాటు స్థానికులు ఇక్కడ నిర్మాణ పనుల్లో పాల్గొంటున్నారు. గురువారం ఉదయం ఘటనా స్థలానికి క్లూస్‌టీమ్‌ వెళ్లింది. వారితో తీసుకెళ్లిన జాగిలం ఈ శీతలీకరణ కేంద్రం వైపు వెళ్లి ఆగింది. పోలీసులు అక్కడ పనిచేస్తున్న 25 మంది కూలీల వేలిముద్రలు సేకరించారు. బాధితురాలిని గురువారం ఉదయం 8:15కు గుంటూరు జీజీహెచ్‌లో చేర్చారు. వైద్యులు పరీక్షించి కాన్పుల విభాగం వార్డుకు తరలించి పలు రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నారు.

ఇదీ చదవండి:GANG RAPE: వేటకొడవళ్లతో బెదిరించి.. భర్తను కట్టేసి.. భార్యపై అత్యాచారం

ABOUT THE AUTHOR

...view details