తెలంగాణ

telangana

ETV Bharat / crime

Serial Killers: ఒంటరి వృద్ధులే లక్ష్యం.. వరుసగా ఆరు హత్యలు!

ఒంటరిగా ఉన్న వృద్ధులే వారి లక్ష్యం. పగలు కూరగాయలు విక్రయిస్తూ రెక్కీ నిర్వహిస్తారు. కొన్ని ఇళ్లను లక్ష్యంగా చేసుకుంటారు. రాత్రిళ్లు వచ్చి ఒంటరిగా ఉన్న వృద్ధులపై దుప్పటి వేసి ఊపిరాడనీయకుండా చేసి చంపేస్తారు . ఆ తర్వాత ఇంట్లో ఉన్న బంగారం, నగదు దోచుకుని దర్జాగా వెళ్లిపోతారు. ఇలా సామాజిక మాధ్యమాల్లో వీడియోలు చూసి వరుసగా ఆరు హత్యలు చేసిన ఐదుగురు నరహంతకుల ముఠా పోలీసులకు చిక్కింది.

serial killers
వృద్ధులే లక్ష్యంగా దొంగతనాలు, సీరియల్​ కిల్లర్స్​

By

Published : Jun 24, 2021, 8:04 PM IST

డబ్బు కోసం యువకులు అడ్డదారి తొక్కారు. హంతకులుగా మారారు. ఒకటి కాదు.. రెండు కాదు.. వరుసగా ఆరు హత్యలు చేశారు. ఈ ఐదుగురు నరహంతకుల మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడ పోరంకికి చెందిన ప్రభుకుమార్, సుంకర గోపిరాజు, కార్మిక నగర్​కు​ చెందిన చక్రవర్తి, నాగ దుర్గారావు, కామయ్యతోపు వాసి మద్ది ఫణీంద్ర కుమార్‌లు స్నేహితులు. వీరు ఆటోడ్రైవర్, కూరగాయల విక్రయం, పెయింటింగ్ పనులు చేస్తుంటారు. సులువుగా డబ్బు సంపాదించేందుకు గోపి అనే వ్యక్తి పథకం వేశాడు. వృద్ధులను హత్య చేసి నగదు దోచుకోవాలని నిర్ణయించి స్నేహితులకు చెప్పాడు. అందరూ కలిసి పక్కా ప్రణాళిక సిద్ధం చేశారు.

పగలు రెక్కీ.. రాత్రి చోరీ

పగటి సమయంలో కూరగాయలు విక్రయిస్తూ..గోపి రెక్కీ నిర్వహిస్తాడు. నిర్మానుష్య ప్రాంతాలు, ఒంటరిగా ఉన్న వృద్ధులను ఎంపిక చేసుకుంటాడు. ప్రత్యేకంగా డబుల్ డోర్ ఉన్న ఇళ్లను ఎంచుకుంటారు. ఎవరికి అనుమానం రాకుండా పక్కగా రాత్రి సమయంలో ఇంట్లోకి చొరబడతారు. నిద్రిస్తున్న వృద్ధుల ఒంటిపై దుప్పటి వేసి ఊపిరాడనీయకుండా చంపేస్తారు. పక్కా ప్రణాళికతో ఎవరికి అనూమనం రాకుండా తమ పని కానిచ్చేస్తారు. ఎలాంటి ఆధారాలు దొరక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. హత్య చేసిన తర్వాత ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు, నగదు దోచుకుని వెళ్లిపోతారు.

ఇలా దొరికారు..

ఇదే తరహాలో కంచికర్ల, పెనమలూరు పీఎస్‌ పరిధిల్లో ఆరు హత్యలు చేశారు. అందరూ కరోనా సమయం కావటం వల్ల సాధారణ మరణాలుగా భావించి త్వరగా అంత్యక్రియలు చేశారని పోలీసులు తెలిపారు. ఈనెల 12న పోరంకి పరిధిలో ఓ ఏటిఎం చోరికి విఫలయత్నం చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు..ఏటీఎంలోని సీసీ ఫుటేజీని పరిశీలించారు. ఇద్దరు నిందితులు ముఖానికి తెల్ల కవర్లు వేసుకుని ఉన్నట్లు గుర్తించారు. నిందితుల దుస్తుల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వీరి వేలిముద్రలను డేటాబేస్‌లో పోల్చిచూస్తే... కంచికచర్లలో జరిగిన వృద్ద దంపతుల హత్యకేసులో దొరికిన వేలిముద్రలతో సరిపోయాయి. ఇంకేముంది.. తీగ లాగితే డొంక బయటకొచ్చినట్లు... వీరిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారిస్తే నివ్వెరపోయే నిజాలు వెలుగుచూశాయి. మిస్టరీగా మారిన వరుస హత్యల్లో నిందితులు వీరేనని తేలింది.

పోరంకి విష్ణుపురంలో నళిని అనే వృద్ధురాలిని, పోరంకికి చెందిన సీతామహాలక్ష్మి, పాపమ్మ, కార్మికనగర్‌కు చెందిన ధనలక్ష్మిలను హత్య చేసినట్లు విచారణలో నిందితులు అంగీకరించారు. బాధితులు మరణించిన కొన్ని రోజులకు ఇంట్లో నగలు పోయాయని ఒకరు మాత్రమే ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచామని వెల్లడించారు.

ఇదీ చదవండి:corona cases: రాష్ట్రంలో కొత్తగా 1088 కరోనా కేసులు, 9 మరణాలు

ABOUT THE AUTHOR

...view details