పెళ్లి చేసుకున్న కొంత కాలానికే భార్య... వేరే వ్యక్తితో వెళ్లిపోయింది. మరో వివాహం చేసుకున్నా... రెండో భార్య కూడా వదలిపెట్టిపోవడంతో మానసిక సంఘర్షణకు లోనైన ఓ వ్యక్తి సైకోగా మారాడు. మహిళలపై ద్వేషం పెంచుకున్నాడు. ఒంటరి మహిళలనే లక్ష్యంగా చేసుకొని నిర్మానుష ప్రాంతాలకు తీసుకెళ్లి హత్యాచారం చేశాడు. ఇలా 18 హత్యలు చేసిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ను ఉత్తర మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
మానసిక సంఘర్షణలకు లోనై...
సంగారెడ్డి జిల్లా కంది మండలం ఆరుట్లకు చెందిన మైన రాములుకు 21ఏళ్ల వయసులో పెళ్లైంది. 1998లో పెళ్లైన కొన్ని నెలలకే భార్య వేరే వ్యక్తితో వెళ్లిపోయింది. దీంతో చుట్టుపక్కల వాళ్లు రాములును చులకనగా చూశారు. అవమానభారం తట్టుకోలేని రాములు రెండో పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత ఆమె కూడా రాములును వదిలిపెట్టడంతో మానసిక సంఘర్షణలకు లోనై... సైకోగా మారాడు. మూడో వివాహం చేసుకున్నా... ఆమెతోనూ సరిగ్గా ఉండలేదు.
నిర్మానుష్య ప్రదేశాలకు తీసుకెళ్లి..
మహిళలపై ద్వేషం పెంచుకున్న రాములు... ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకోవడం మొదలు పెట్టాడు. కల్లు దుకాణాలు, వైన్స్ షాపుల వద్ద కనిపించే మహిళలతో పరిచయం పెంచుకోసాగాడు. వారితో మాట కలిపి... నిర్మానుష్య ప్రదేశాలకు తీసుకెళ్లేవాడు. 2003లో మెదక్ జిల్లా తూప్రాన్‌లో ఓ మహిళను తీసుకెళ్లి హత్య చేశాడు. ఇలా 2009 వరకు పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో 9 మంది మహిళలను హత్య చేశాడు. ఒంటరిగా ఉండే మహిళలను లక్ష్యంగా చేసుకోవడం, నిర్మానుష ప్రాంతాలకు తీసుకెళ్లి పూటుగా కల్లు తాపించి శారీరక వాంఛ తీర్చుకున్న తర్వాత మహిళలను హత్య చేయడం రాములు నైజం.
జీవిత ఖైదు విధించినా..
కేవలం హత్యలే కాకుండా 4 దొంగతనాల కేసులు కూడా రాములుపై నమోదయ్యాయి. 2003 నుంచి 2009 వరకు జరిగిన 9 హత్యల్లో 7 హత్యలు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే కావడంతో ఎస్ఓటీ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి మైన రాములును అరెస్ట్ చేశారు. రంగారెడ్డి న్యాయస్థానం 2011 ఫిబ్రవరిలో రాములుకు జీవిత ఖైదు విధించింది. రాములును చర్లపల్లి జైలుకు తరలించగా... మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో జైలు అధికారులు చికిత్స కోసం ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయానికి పంపించారు. 2011 డిసెంబర్ 30న ఎర్రగడ్డ ఆస్పత్రి నుంచి మరో ఐదుగురు ఖైదీలతో కలిసి రాములు పారిపోయాడు.
ఒక్క ఏడాదిలోనే నాలుగు హత్యలు
జైలు నుంచి పారిపోయిన రాములు ఆ తర్వాత హత్యల పరంపర ఆపలేదు. 2012లో ఒక్క ఏడాదిలోనే నలుగురు మహిళలను హత్య చేశాడు. 2013లో ఒక మహిళను హత్య చేశాడు. బోయిన్పల్లి ఠాణా పరిధిలో ఇద్దరు మహిళలను, చందానగర్ ఠాణాల్లో పరిధిలో ఇద్దరు, దుండిగల్ ఠాణా పరిధిలో మరో మహిళను హత్య చేశాడు. ఈ ఐదు హత్య కేసులకు సంబంధించి బోయిన్పల్లి పోలీసులు 2013లో రాములును అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అయితే తనపై ఉన్న హత్య కేసులకు సంబంధించి జైలు శిక్ష అనుభవిస్తున్న రాములు, జైలు నుంచే హైకోర్టుకు లేఖ రాశారు. తనను విడుదల చేయాల్సిందిగా ఆ లేఖలో కోరారు.