తెలంగాణ

telangana

ETV Bharat / crime

'భూ పంచాయితీ'కి జిల్లా అధికారి కొడుకు బలి! - సంగారెడ్డిలో భూ తగాదాలు

'మారము.. ఇక ఎన్నటికీ మారము' అనేలా వ్యవహారిస్తున్నారు కొందరు రెవెన్యూ అధికారులు. వ్యవస్థ సమూల ప్రక్షాళనకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు... ఆ అధికారుల చర్యలతో నీరుగారిపోతున్నాయి. సామాన్యులే కాదు... జిల్లాస్థాయి అధికారులైనా తమ బాధితులే అన్నట్లుగా ప్రవరిస్తున్నారు. ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న భూసమస్యను పరిష్కరించకపోవడంతో ప్రత్యర్థుల దాడిలో కొడుకును కోల్పోయి కంటనీరు పెడుతున్నారు... మెదక్‌ జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దేవయ్య.

sangareddy district
sangareddy district

By

Published : Jan 19, 2021, 7:38 AM IST

భూతగాదాలు.. కొడుకును కోల్పోయిన జిల్లా అధికారి

ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్య... ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యంతో కొడుకును కోల్పోయి విలపిస్తున్నారు మెదక్‌ జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దేవయ్య. ఈనెల 5న పొలానికి వెళ్లి తిరిగొస్తుండగా... ప్రత్యర్థి వర్గం వ్యక్తులు ఒక్కసారిగా దాడి చేయడంతో కుమారుడు కరుణాకర్‌ ప్రాణాలు కోల్పోయారు. దేవయ్యకు తీవ్రగాయాలయ్యాయి. సంగారెడ్డి జిల్లా చౌటకూరుకు చెందిన బేగరి దేవయ్య, కాశన్నగారి సంతోషమ్మ కుటుంబాల మధ్య... భూసరిహద్దు వివాదముంది. సర్కారీ భూమిలో సంతోషమ్మ కుటుంబసభ్యులు తప్పుడు పత్రాలు సృష్టించి పహణిల్లో వచ్చి చేరారని దేవయ్య ఆరోపిస్తున్నారు. ఆధారాలిచ్చినా పట్టించుకోకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడమే... తమ కుమారుడి మరణానికి కారణమైందని ఆయన వాపోతున్నారు.

ఆ నివేదిక ఏమైంది

ఈ సరిహద్దు వివాదం పరిష్కారానికి అప్పటి తహసీల్దార్‌ ఓ సర్వే చేపట్టారు. అయితే ఆ నివేదిక కూడా ఇప్పుడు రెవెన్యూ అధికారుల వద్ద లేదని ఆరోపిస్తున్నారు మృతుడి బంధువులు. పుల్కల్ మండలం నుంచి కొత్తగా ఏర్పడిన చోటకూరు మండలానికి సంబంధించిన పూర్తిస్థాయి రికార్డులు తమకు అందలేదంటున్నారని విస‌్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సర్కారీ భూమిలో ఎంత మందికి అసైన్డ్‌ పట్టాలిచ్చారనే సమాచారం ఇప్పటికీ అధికారుల వద్ద లేదని ఆరోపిస్తున్నారు. హత్య జరిగినా సమస్య పరిష్కారంలో చొరవ చూపకపోవడం పట్ల బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సేల్ డీడ్ పత్రాలు నకిలీవంటూ..

దేవయ్య పట్టా భూమికి సంబంధించిన సేల్ డీడ్ పత్రాలు నకిలీవంటూ అధికారులకు సంతోషమ్మ ఫిర్యాదు చేశారు. జిల్లా అధికారి అయిన దేవయ్య తన పలుకుబడితో తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. సరిహద్దు వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికైనా అలసత్వం వీడి సమస్య పరిష్కరించాలని దేవయ్య కుటుంబసభ్యులు కోరుతున్నారు. తమలాంటి కష్టం మరెవరికీ రాకుండా చూడాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చదవండి :తెలంగాణలో ప్రాంతీయ విమానాశ్రయాలకు సానుకూలం

ABOUT THE AUTHOR

...view details