Ramakrishna mother, sister arrested: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ కుటుంబం ఆత్మహత్య కేసులో ఏ-3, ఏ-4గా ఉన్న రామకృష్ణ సూర్యవతి, సోదరి మాధవిని పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించగా.. వారిద్దరిని పోలీసులు ఖమ్మం సబ్ జైలుకు తరలించారు. ఈ కేసులో ఎమ్మెల్యే కుమారుడైన వనమా రాఘవేందర్ రావును పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.
అసలేం జరిగిందంటే..
భద్రాద్రిలోని పాత పాల్వంచలో నాగరామకృష్ణ మీ సేవా కేంద్రాన్ని నడిపించే వాడు. ఇటీవలే మీ సేవా కేంద్రాన్ని ఇతరులకు లీజుకు ఇచ్చాడు. అనంతరం భార్య పిల్లలను తీసుకుని రాజమహేంద్రవరం వెళ్లారు. కొన్ని రోజుల క్రితం రామకృష్ణ కుటుంబం పాల్వంచ వచ్చింది. అప్పటినుంచి మదనపడిన దంపతులు చివరకు ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. పిల్లలు అనాథలు కాకుడదని వారిని చంపేందుకు సిద్ధమయ్యారు. పెట్రోల్ పోసుకుని.. ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలో కుమార్తె సాహిత్య సహా దంపతులు నాగరామకృష్ణ, శ్రీలక్ష్మీ మృతి చెందారు. మరో కుమార్తె సాహితి తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.
తమ మృతికి కారణం వారేనంటూ..
అనంతరం తమ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి వారే కారణమంటూ రామకృష్ణ సూసైట్ నోట్ బయటపడింది. సూసైడ్ నోట్‌లో ఎమ్మెల్యే వనమా కుమారుడు రాఘవేందర్‌తో పాటు రామకృష్ణ తల్లి సూర్యవతి, అక్క మాధవి పేర్లు కూడా ఉన్నాయి. వనమా రాఘవేందర్‌కు రామకృష్ణ అక్క మాధవికి వివాహేతర సంబంధం ఉందని... వారివల్ల తనకు అన్యాయం జరుగుతోందని అందుకే... ఆత్మహత్య చేసుకున్నట్లు రామకృష్ణ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. అనంతరం మరో సెల్ఫీ వీడియో బయటపడింది. ఆ సెల్ఫీ వీడియో తాను చనిపోవడానికి గల కారణాలను ఆవేదనతో వెల్లడించాడు.
సెల్ఫీ వీడియో సంచలనం
ఈ నెల 3న భార్య, ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డ నాగ రామకృష్ణ.. అంతకుముందు తీసుకున్న సెల్ఫీవీడియోలో వనమా రాఘవపై తీవ్ర ఆరోపణలు చేశాడు. అవమానం భరించలేక కుటుంబంతో సహా చనిపోతున్నట్లు రామకృష్ణ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. దీనికి తన తల్లి, సోదరి కూడా కారణమంటూ వీడియోలో వెల్లడించాడు. ఘటన బయటికి వచ్చినప్పటి నుంచి పరారీలో ఉన్న రాఘవ ఆచూకీ కోసం పోలీసులు... రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్రంగా గాలించారు. ఎట్టకేలకు.. మందలపల్లి అడ్డరోడ్డు వద్ద రాఘవను పోలీసులు పట్టుకున్నారు. గతేడాది వెంకటేశ్వరరావు ఆత్మహత్య కేసులో రాఘవకు నోటీసులు ఇవ్వటం సహా.. రాఘవపై గతంలో నమోదైన కేసులను పోలీసులు వెలికితీశారు. అతనిపై ఇప్పటివరకు 12 కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో ఏ-2గా ఉన్న వనమా రాఘవను.. ఇప్పటికే తెరాస అధిష్ఠానం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
సెల్పీ వీడియోలో..
రాఘవ కారణంగా ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయి. అలాంటి దుర్మార్గులను రాజకీయంగా ఎదగనివ్వొద్దు. డబ్బు రూపంలో అడిగినా ఇచ్చేవాడిని. ఏ భర్త కూడా వినకూడని మాటను రాఘవ అడిగారు. నా భార్యను హైదరాబాద్ తీసుకురావాలని కోరారు. రాజకీయ, ఆర్థిక బలంతో పబ్బం గడుపుకోవాలని చూశారు. నేను ఒక్కడినే వెళ్లిపోతే నా భార్య, పిల్లలను వదిలిపెట్టరు. అందుకే నాతో పాటు వారినీ తీసుకెళ్తున్నా. అప్పుల్లో ఉన్న నాపై నా తల్లి, సోదరి కక్ష సాధించారు' అని నాగ రామకృష్ణ సెల్ఫీ వీడియోలో చెప్పారు.
ఇదీ చదవండి: