నిజామాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి రూ.5 వేల నుంచి రూ.25లక్షల వరకు వసూలు చేశాడు. మొత్తం రూ.కోటి పైగా వసూలు చేసి కనిపించకుండా పోయాడు. పెళ్లి కోసం, ప్రసవం గురించి, పిల్లల చదువులు, ఆస్పత్రి ఖర్చుల కోసం.. ఇలా అవసరం కోసం దాచుకున్న సొమ్మును పూజారి చేతిలో పెట్టిన మహిళలు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. పూజారి చేతిలో మోసపోయాం.. న్యాయం చేయాలంటూ బాధిత మహిళలు పోలీసులను ఆశ్రయించారు. డిచ్‌పల్లి మండలం ధర్మారం(బీ)లోని ఓ ఆలయానికి గతేడాది నవంబరులో శ్రీనివాసశర్మ అనే అర్చకుడు వచ్చాడు. ఆ పూజారికి గ్రామస్థులు అక్కడే ఆశ్రయం కల్పించారు. నోములు, వ్రతాల కోసం వచ్చే మహిళలతో కొన్నాళ్లు ప్రత్యేక పూజలు చేయించాడు. ఆర్థిక పరిస్థితి బాగా లేదు.. గ్రహస్థితి సరిగా లేదు.. కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగుండటం లేదని వచ్చేవారితో సుమంగళి, నాగపూజలు చేయించేవాడు.
పెట్టుబడి పెడితే కమీషన్
తనతో ఎన్‌ఆర్‌ఐలు, సినీ పరిశ్రమ వారు, నిర్మాతలు పూజలు చేయించుకొంటున్నారని.. వాళ్లు ఇక్కడికి రాలేరని... వారి పేరుపై చేసే పూజలకు పెట్టుబడి పెడితే కమీషన్ పొందొచ్చని మహిళలను నమ్మించాడు. దీంతో కొందరు మహిళలు పెట్టుబడి పెట్టారు. మొదట్లో వారిని నమ్మించేందుకు రూ.10 వేలు పెడితే రూ.12 వేలు, రూ.15 వేలు పెడితే రూ.20 వేలు ఇవ్వడంతో అందరూ నమ్మారు. కమీషన్ డబ్బుల్లోనూ కొంత హుండీలో వేయించాడు. అసలే కరోనా కాలం.. ఏ పని చేద్దామన్నా దొరకట్లేదు... ఇంట్లో ఉండి కమీషన్ రూపంలో డబ్బులు సంపాదించుకోవచ్చని వారికి గాలం విసిరాడు. అది నమ్మి చాలా మంది అత్తకు తెలియకుండా కోడలు.. భర్తకు చెప్పకుండా భార్య.. పెట్టుబడి పెట్టారు. ఇంట్లో తెలియకుండా మహిళలంతా పూజారికి డబ్బులు ఇచ్చారు. అందరి వద్దా అందినకాడికి వసూలు చేసిన ఘనుడు మే 29న కనిపించకుండా పోయాడు. కొద్ది రోజులు ఫోన్ మాట్లాడిన పూజారి.. ఆ తర్వాత ఫోన్ కూడా పనిచేయకపోవడంతో మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు.
రూ. లక్షల్లో చీటింగ్
నిజామాబాద్ నగరానికి చెందిన ఓ మహిళ తన భర్తకు అనారోగ్యం ఉందంటూ పూజారిని ఆశ్రయించింది. వారి గ్రహస్థితి బాగా లేదని అర్చకుడు పూజలు చేయించాడు. పూజలకు పెట్టుబడి పెడితే కమీషన్ వస్తుందంటూ ఆశ చూపించాడు. దీంతో భూమి విక్రయించగా వచ్చిన రూ.25 లక్షలు పలు దఫాలుగా ఇచ్చి మోసపోయారు. నందిపేట్ మండలం ఆంధ్రానగర్‌కు చెందిన ఓ మహిళ రూ.10 లక్షల వరకు ఇచ్చినట్లు సమాచారు. నిజామాబాద్‌కు చెందిన ఓ మహిళ రూ.6 లక్షలు, బోధన్ మండలం పెగడాపల్లికి చెందిన పలువురు స్త్రీలు రూ.లక్షల్లో సమర్పించుకున్నట్లు తెలుస్తోంది.
రూ. 5 లక్షల వరకు నన్ను మోసం చేశాడు. నా భర్త విషయంలో చిన్న తప్పు చూపించి పూజల పేరుతో నన్ను ముంచాడు. పిల్లల చదువులకు దాచిపెట్టిన డబ్బులు, అప్పులు తెచ్చి మరీ పెట్టాను. సుమంగళి పూజల పేరుతో పెట్టుబడి పెట్టించి.. డబ్బులు కాజేసి ఇప్పుడు పారిపోయాడు. -మాధవి, బాధితురాలు