Murder Case in Banjara Hills పిల్లి విషయంలో మొదలైన వివాదం ఏకంగా ఓ యువకుడి ప్రాణాలు తీసింది. పిల్లి అరుపులకు చికాకుపడి పక్క గదిలో ఉండే యువకుడిపై కిరోసిన్ పోసి తగులబెట్టేశారు. దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించారు. మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. ఈ ఘటన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో జరిగింది.
అసలేం జరిగిందంటే: బంజారాహిల్స్ రోడ్ నం.10లోని మిథిలానగర్‌లో నివసించే వ్యాపారి మీనన్ ఇంట్లో... రంగారెడ్డి జిల్లా పాలమాకులకు చెందిన బాలుడు(17) వంట పనుల్లో సాయంగా, రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం మల్లాపూర్‌కు చెందిన హరీశ్వర్‌రెడ్డి అలియాస్ చింటు(20) డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. యజమాని ఇంట్లోనే మొదటి అంతస్తులో ఓ గదిలో వీళ్లిద్దరు ఉంటున్నారు. దాని పక్కనే ఉన్న మరో గదిని అసోంలోని శివసాగర్‌కు చెందిన ఎజాజ్ హుస్సేన్(20), బ్రాన్ స్టిల్లింగ్(20)కు అద్దెకిచ్చారు. వీరిద్దరూ బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో కాపలాదారులుగా పనిచేస్తున్నారు.
ఈ నెల 20న రాత్రి ఇద్దరూ ఇంటికి వెళ్తుండగా బ్రాన్ స్టిల్లింగ్‌కు పిల్లిపిల్ల కన్పించగా దాన్ని గదికి తీసుకెళ్లాడు. అది అరుస్తుండటంతో పక్క గదిలో ఉండే బాలుడు ఏంటి ఈ గోల అని గొడవకు దిగాడు. 25వ తేదీ రాత్రి ఇదే విషయంలో ఎజాజ్, బాలుడు మళ్లీ గొడవపడ్డారు. ఎజాజ్ మీద బాలుడు కిరోసిన్ పోసి నిప్పటించాడు. గమనించిన హరీశ్వర్‌రెడ్డి, స్టిల్లింగ్ వెంటనే మంటలు ఆర్పారు. విద్యుదాఘాతం జరిగిందని చెప్పాలని, లేదంటే చంపేస్తానంటూ స్టిల్లింగ్‌ను బెదిరించడంతో భయపడ్డాడు. విద్యుదాఘాతం అయిందని ఇంటి యజమానికి చెప్పి కారు తీసుకున్నారు. ముగ్గురు కలిసి క్షతగాత్రుణ్ని కారులో ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమించి గురువారం రాత్రి అతను మృతిచెందాడు. శుక్రవారం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ముగ్గురినీ వేర్వేరుగా విచారించగా అసలు విషయం తెలిసింది. బాలుడితో పాటు హరీశ్వర్‌రెడ్డిని శనివారం అరెస్టు చేశారు.
ఇవీ చదవండి:ఉద్యోగం కోసం డబ్బులిచ్చి మోసపోయానని యువకుడి ఆత్మహత్య
అందరి కళ్లూ నోయిడా జంట భవనాలపైనే, ఏం జరుగుతుందో