ఇదెక్కడి దొంగ తెలివిరా బాబు... సైబర్ నేరగాళ్ల కొత్త రూట్ Cyber Fruad: ఫోన్‌లో మనం చెప్పే ఓటీపీతో నిండా ముంచేస్తుంటారు. డబ్బులొస్తాయనే అమాయకుల అత్యాశను ఆసరాగా చేసుకుని కోట్ల రూపాయలను కొల్లగొడుతుంటారు. సైబర్ మోసగాళ్లు ఎంత తెలివి ప్రదర్శించినా... అధునాతన టెక్నాలజీతో అరగంటలో పోలీసులు వారిని గుర్తిస్తున్నారు. అదీ కాదంటే బ్యాంకు లావాదేవీలే ఆ దొంగలను పోలీసులకు వద్దకు తీసుకువస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎవరూ ఊహించని మార్గాలను ఎంచుకుని, పోలీసులనే ఆశ్చర్యానికి గురిచేశారు కొందరు కేటుగాళ్లు. హైదరాబాద్‌లో ఆన్‌లైన్ మోసగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న ఓ వ్యక్తి ఫిర్యాదుపై సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే 'ఈ-పోస్' యంత్రంతో జరుపుతున్న లావాదేవీలు వెలుగులోకి వచ్చాయి.
రూ. 10 లక్షల వరకు...
E-POS Cheating: రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకుల సేవలను విస్తరించేందుకు గానూ... పలు బ్యాంకులు 'ఈ-మిత్ర' సేవలను అందుబాటులోకి తీసుకువచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో 'మీ-సేవా' తరహాలో అక్కడ ఈ కేంద్రాలు పనిచేస్తుంటాయి. 'ఈ-మిత్ర' నిర్వాహకులకు 'ఈ-పోస్' యంత్రాలను అందజేసిన బ్యాంకులు... ఒక్క నిర్వాహకుడికి రూ. 5 నుంచి 10లక్షల రూపాయల వరకు విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించాయి. ఖాతాదారులు డెబిట్ కార్డును 'ఈ-పోస్' యంత్రంలో స్వైప్ చేసి పరిమితికి లోబడి 'ఈ-మిత్ర'ల వద్ద నగదును తీసుకుంటూ ఉంటారు.
ఈ-మిత్ర కేంద్రాల ద్వారా...
E-Mitra: ఇప్పటికే బ్యాంకు ఖాతాల ఆధారంగా విచారణ, నగదు తీసుకుంటున్న బ్యాంకులు, ఏటీఎంల వద్ద నిఘా ఉంచినట్లు గుర్తించిన సైబర్ నేరగాళ్లు... ఆయా రాష్ట్రాల్లోని 'ఈ-మిత్ర' కేంద్రాలను ఆశ్రయించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి సీసీటీవీ కెమెరాలు, నిఘా వ్యవస్థ లేకపోవటంతో ఇదే సులువైన మార్గంగా ఎంచుకున్నారు. రాజస్థాన్‌లోని అల్వార్, భరత్‌పూర్, మేవాడ్, మధ్యప్రదేశ్‌లోని 3 జిల్లాల్లోని 'ఈ-మిత్ర' కేంద్రాల ద్వారా డబ్బులు డ్రా చేస్తున్నారు. 'ఈ-మిత్ర' నిర్వాహకులకు కమిషన్ ఇస్తూ... నిత్యం లక్షల్లో నగదును తీసుకుంటున్నారు. హైదరాబాద్‌లో బాధితుడి ఫిర్యాదుతో లోతుగా దర్యాప్తు చేపట్టిన సైబర్ క్రైం పోలీసులు... భరత్‌పూర్‌లోని జాతీయ బ్యాంకు అధికారులను సంప్రదించారు. ఈ క్రమంలోనే సునీల్ కుమార్ అనే వ్యక్తి 'ఈ-పోస్' యంత్రం ద్వారా 10 లక్షల రూపాయలు విత్‌డ్రా చేసినట్లు పోలీసులు గుర్తించారు.
పూర్తిస్థాయి విచారణ...
Bharatpur Cyber crime: భరత్‌పూర్‌లో సైబర్ నేరగాళ్లకు డబ్బులిచ్చిన 'ఈ-మిత్ర' నిర్వాహకుడు సునీల్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా... ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 'ఈ-పోస్' యంత్రంలో డెబిట్ కార్డులు స్వైప్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు... ఆన్‌లైన్‌లో ప్రజలను మోసం చేసి కాజేసిన మొత్తాన్ని నగదుగా పొందుతున్నట్లు గుర్తించారు. పట్టుబటిన 'ఈ-మిత్ర' నిర్వాహకుడు సునీల్ కుమార్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారు.
ఇవీ చూడండి: