గుర్రపు పందేలు కొంప ముంచాయని.. ఆన్లైన్ బెట్టింగుల పేరుతో.. Horse Race Betting: గుర్రపు పందెంలో డబ్బులు పెట్టడం చాలా మందికి సరదా. ఇందులో డబ్బులు సంపాదించే వాళ్లు కొంత మంది ఉంటే... పొగొట్టుకునే వాళ్లు కూడా అదే స్థాయిలో ఉంటారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం రెడ్డిపాలెంకు చెందిన తిర్మల్ రెడ్డి జోజిరెడ్డి.. కూడా రేసు కోర్సులకు నిత్యం వెళ్లే వాడు. గుర్రాలపై పందెం కాసి చాలా నష్టపోయాడు. ఊర్లో ఉన్న పొలం కూడా అమ్ముకున్నాడు. పోయిన డబ్బులను ఎలాగైనా మళ్లీ సంపాదించుకోవాలనుకున్నాడు. దాని కోసం తిర్మల్రెడ్డి ఓ పథకం పన్నాడు. ఇందుకోసం ఆన్లైన్ బెట్టింగ్ అప్లికేషన్ను ఉపయోగించుకున్నాడు.
police arrested 5 members for online horse betting in hyderabad వాట్సప్ గ్రూపులతో ఆకర్షిస్తూ..
కొవిడ్ కారణంగా చాలా మంది రేసు కోర్సులకు వెళ్లాలంటే వెనకడుగు వెస్తున్నారు. దీన్నే ఆసరాగా చేసుకొని జోజిరెడ్డి 2020 ఏప్రిల్లో ట్రూ స్టార్స్ పేరుతో ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేశాడు. అందులో గుర్రపు పందేలకు వెళ్లే వాళ్లను సభ్యులుగా చేర్చాడు. అదే ఏడాది నవంబర్లోనూ ఆర్సీ లెజెండ్స్ పేరుతో మరో గ్రూప్ ఏర్పాటు చేశాడు. ఒక్కో గ్రూపులో 20మందికి పైగా సభ్యులున్నారు. గుర్రపు పందెలకు సంబంధించి ఈ గ్రూపులో డబ్బులు వసూలు చేసి వాటిని బెట్టింగ్లో పెడుతుంటాడు. సభ్యులను ఆకర్షించేందుకు అందులో తన వాళ్లను సభ్యులుగా చేర్చాడు. రేసు కోర్సులో భారీగా లాభాలు స్వీకరించినట్లు సదరు సభ్యులతో పోస్టింగులు పెట్టిస్తాడు. ఈవిధంగా గ్రూపులో వాళ్లని ఆకర్షించి వాళ్ల చేత బెట్టింగ్ పెట్టించటం తిర్మల్రెడ్డి ప్లాన్.
పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదు, ట్యాప్టాప్లు, మొబైల్స్.. రోజుకు 20 నుంచి 40 వేల సంపాదన..
"బెట్ 365 యాప్ ద్వారా పలు రేసుకోర్సులకు సంబంధించిన స్క్రీన్షాట్లను వాట్సాప్ గ్రూపులలో పోస్టు చేస్తాడు. వాటికి ఆకర్షితులైన వాళ్లు చాలా మంది బెట్టింగ్ పెడతారు. ఆ డబ్బులను జోజిరెడ్డి ఖాతాలో జమ చేశారు. డబ్బు మొత్తాన్ని జోజిరెడ్డి.. బెట్టింగ్లో పెట్టకుండా తన ఖాతాలోనే ఉంచుకుంటున్నాడు. ఒకరిద్దరి సభ్యులు డబ్బులు మాత్రమే బెట్టింగ్లో పెడుతున్నాడు. ఒకవేళ ఆ గుర్రాలు గెలిస్తే సదరు వ్యక్తులకు డబ్బులు చెల్లిస్తాడు. మిగతా సభ్యులకు చెందిన డబ్బులన్నీ తన వద్దే ఉంచుకుంటాడు. గుర్రాలు ఓడిపోయాయని వాళ్లను నమ్మిస్తాడు. ఇందుకోసం తిర్మల్రెడ్డి ఏకంగా అకౌంటెంటును సబ్ ఆర్గనైజర్లను కూడా నియమించుకున్నాడు. ఈ మార్గంలో జోజిరెడ్డి రోజూ 20 నుంచి 40వేల వరకు సంపాదిస్తున్నాడు." -మహేశ్ భగవత్, రాచకొండ సీపీ
డెకాయి ఆపరేషన్లో బయటపడిన బాగోతం..
హైదరాబాద్ ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు చేసిన డెకాయి ఆపరేషన్లో జోజిరెడ్డి బాగోతం బయటపడింది. ఇందులో భాగస్వామ్యమైన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుని వద్ద ఉన్న 42 లక్షల నగదును, ల్యాప్టాప్లు, చరవాణీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్రూపులో మాధవరెడ్డి అనే ఎక్సైజ్ ఎస్సై కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కొన్నేళ్లుగా గుర్రపు పందెల్లో డబ్బులు పెడుతున్నట్లు గుర్తించిన పోలీసులు.. అతడిని కూడా అరెస్టు చేశారు. ఆన్లైన్ బెట్టింగులు నిషేధమని.. క్రికెట్, గుర్రపు పందేల్లో బెట్టింగులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఇదీ చూడండి: