Ammonia leakage : ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని బ్రాండిక్స్ సెజ్ పరిధిలోని పోరస్ కంపెనీలో అమోనియా వాయువు లీకైంది. దీంతో పక్కనున్న సీడ్స్ కంపెనీలో పనిచేసే వంద మందికి పైగా మహిళలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, తల తిరగడం, కళ్ల మంటతో ఇబ్బంది పడ్డారు. అస్వస్థతకు గురైన మహిళలను హుటాహుటిన బ్రాండిక్స్ సెజ్ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు.
పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న చాలా మంది మహిళలను అంబులెన్సుల్లో అనకాపల్లిలోని ఎన్టీఆర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. వారిలో మహిళా సెక్యూరిటీ సూపర్వైజర్ పరిస్థితి తీవ్రంగా ఉందని... చికిత్స కొనసాగిస్తున్నామని వైద్యులు తెలిపారు. అమోనియా లీక్ ఘటన వివరాలు తెలుసుకున్న కలెక్టర్ రవిసుభాష్.. మహిళా కార్మికులకు మెరుగైన చికిత్స అందించాలని జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారి హేమంత్ కుమార్‌ను ఆదేశించారు. అస్వస్థులైన మహిళలకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు బ్రాండిక్స్ భారత భాగస్వామి దొరైస్వామి చెప్పారు.
సెజ్‌కు వెలుపల ఉన్న పోరస్ కంపెనీ నుంచి అమోనియా వాయువు లీకైందని... కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తెలిపారు. దీనివల్లే సమస్య తలెత్తిందన్నారు. ఆ తర్వాత అమోనియో లీకేజీని పోరస్ కంపెనీ నిర్వాహకులు అరికట్టినట్లు చెప్పారు. లీకేజీకి కారణాలేంటన్నది తెలుసుకుంటున్న వివరించారు. అమోనియా లీకేజీ ఘటనతో అప్రమత్తమైన బ్రాండిక్స్ నిర్వాహకులు... రెండో షిఫ్ట్ రద్దు చేశారు. ఉద్యోగులందరినీ ఇళ్లకు పంపించివేశారు.