తెలంగాణ

telangana

ETV Bharat / crime

కోళ్లను కాపాడటానికి వెళ్లాడు.. ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు - బావిలో పడిన వ్యక్తికి ఇనుప చువ్వలు తగలడంతో గాయాలు

మంచి కోసం పోతే.. చెడు ఎదురైంది ఓ వ్యక్తికి. ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న కోళ్లు బావిలో పడిపోయాయని వాటిని తీసేందుకు అందులోకి దిగాడు. కోళ్లను బాగానే బయటకు తీశాడు కానీ.. తాను పైకి వచ్చేప్పుడే అనుకోని ప్రమాదం అతని ప్రాణాలకు ముప్పు తెచ్చింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..?

well
బావిలో పడిన వ్యక్తి

By

Published : Jan 29, 2023, 9:05 AM IST

బావిలో పడిపోయిన కోళ్లను బయటకు తీసే యత్నంలో ఓ వ్యక్తి జారి పడటంతో ఇనుప చువ్వలు గుచ్చుకున్న సంఘటన ఇది. భుజం, వెన్నెముక, మూత్రపిండాల భాగంలో అవి దిగడంతో నాలుగు గంటల పాటు నరకయాతన అనుభవించాడు. చివరకు పోలీసులు క్రేన్లు, వెల్డర్‌ సాయంతో తీవ్రంగా శ్రమించి బాధితుడిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​ మండలం అర్జున్​నాయక్​ తండాలో జరిగింది.

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలం అర్జున్‌నాయక్‌ తండా శివారులోని వ్యవసాయ క్షేత్రంలో పని చేసే గోవింద్‌నాయక్‌ వద్దకు కోహీర్‌ మండలం సిద్ధాపూర్‌ తండాకు చెందిన ఆయన అల్లుడు రాము రాథోడ్‌ శనివారం భార్యా పిల్లలతో కలిసి వచ్చాడని జహీరాబాద్‌ గ్రామీణ ఎస్సై పరమేశ్వర్‌, కుటుంబసభ్యులు తెలిపారు. వ్యవసాయ బావిలో కోళ్లు పడిపోవడంతో రాము రాథోడ్‌(42) తాడు కట్టుకుని దిగి మొదట వాటిని బుట్టలో వేసి పైకి పంపాడని చెప్పారు. తర్వాత అదే తాడు సాయంతో ఆయన పైకి చేరుకుంటుండగా.. జారి కిందకు పడిపోతూ బావి సిమెంటు రింగులకు ఉన్న ఇనుప చువ్వలు గుచ్చుకుని మధ్యలోనే ఇరుక్కుపోయాడని వివరించారు.

భుజం, వెన్నెముకలో చువ్వలు లోపలి వరకు దిగిపోవడంతో కదల్లేని స్థితిలో ఉండిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు రెండు క్రేన్లు, ఫైర్‌ ఇంజిన్‌ సాయంతో ఘటనా స్థలానికి వచ్చి రామును బయటకు తీసేందుకు ప్రయత్నించారు. సాధ్యం కాకపోవడంతో వెల్డర్‌ను పిలిపించి కోత యంత్రం సాయంతో చువ్వలు కత్తిరించి క్షతగాత్రుడిని బయటకు తీశారు. అంబులెన్స్‌లో జహీరాబాద్‌ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించగా వైద్యులు ప్రాథమిక చికిత్స చేసి సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి రెఫర్‌ చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details