తెలంగాణ

telangana

ETV Bharat / crime

మావోయిస్టులతో సంబంధాల కేసు... ముగ్గురి అరెస్ట్.. ఇంతకీ ఏం తేలిందంటే? - మావోయిస్టు అగ్రనేత దుబాషి శంకర్‌ కుమారుడు శంకర్‌ నివాసంలో ఎన్​ఐఏ సోదాలు

రాష్ట్రంలోని పలుచోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలు జరిపింది. నర్సింగ్‌ విద్యార్థిని రాధ అదృశ్యం కేసులో విచారణ జరుపుతోన్న ఎన్​ఐఏ అధికారులు.. హైదరాబాద్‌ ఉప్పల్‌తో పాటు మెదక్‌ జిల్లా చేగుంట, మేడిపల్లి పర్వతాపూర్​లో గురువారం తెల్లవారుజాము నుంచి తనిఖీలు చేశారు. ఈ కేసులో దేవేంద్ర, స్వప్న, శిల్పలను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది.

NIA searches at High Court Advocate Shilpa house
NIA searches at High Court Advocate Shilpa house

By

Published : Jun 24, 2022, 4:59 AM IST

మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న అభియోగాలతో చైతన్య మహిళా సంఘం (సీఎంఎస్‌) నాయకులు దేవేంద్ర, స్వప్న, హైకోర్టు న్యాయవాది శిల్పను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు గురువారం అరెస్టు చేశారు. 3 ఏళ్ల క్రితం తమ కుమార్తెను కిడ్నాప్‌ చేశారని 2017 డిసెంబరులో విశాఖలోని పెదబయలు పీఎస్‌లో రాధ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎంఎస్ నాయకులు... రాధను కిడ్నాప్ చేసి బలవంతంగా మావోయిస్టు పార్టీలో చేర్చుకున్నారని ఆమె తల్లి ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎంఎస్ నాయకులు దేవేంద్ర, స్వప్న, హైకోర్టు న్యాయవాది శిల్ప, తదితరులు తమ నివాసానికి వచ్చేవారని తెలిపారు. వైద్యం పేరుతో దేవేంద్ర.. రాధను తీసుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

విశాఖ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఎన్‌ఐఏ అధికారులు శిల్పపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇవాళ ఉదయం ఉప్పల్‌ చిలుకానగర్‌లోని శిల్ప నివాసంలో, చైతన్య మహిళా సంఘం కార్యాలయంలో సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ అధికారులు డిజిటల్‌ సామగ్రి, మావోయిస్టు భావజాల సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మెదక్‌ జిల్లా చేగుంటలోని మావోయిస్టు అగ్రనేత దుబాషి శంకర్‌ కుమారుడి ఇంట్లో తెల్లవారుజాము నుంచి సోదాలు నిర్వహించారు. గతంలో ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ప్రభాకర్‌ భార్య, న్యాయవాది దేవేంద్రను మేడ్చల్‌ జిల్లాలోని మేడిపల్లి పర్వతాపూర్‌లో అదుపులోకి తీసుకున్నారు. దేవేంద్ర, స్వప్న, శిల్ప ముగ్గురూ మావోయిస్టు అనుబంధ సంస్థ చైతన్య మహిళా సంఘంలో పనిచేస్తున్నట్టు ఎన్‌ఐఏ అధికారులు నిర్ధారణకు వచ్చారు.

నర్సింగ్ చదివిస్తామని.. నక్సల్స్‌లో చేర్చి... తమ కుమార్తె రాధను నర్సింగ్‌ చదివిస్తామని 2017 లో హైదరాబాద్‌ నుంచి నరేందర్‌ అనే వ్యక్తి తీసుకెళ్లాడని... అప్పటినుంచి కనిపించకుండా పోయిందని...యువతి తల్లి పోచమ్మ ఈ ఏడాది జనవరిలో ఫిర్యాదు చేసింది. రాధ కనిపించకుండా పోయిందని విశాఖపట్నం జిల్లా పెద్దబయుల పోలీస్‌స్టేషన్‌కు రిజిస్టర్‌ పోస్టులో ఫిర్యాదు లేఖ పంపింది. చైతన్య మహిళ సంఘానికి చెందిన నరేందర్‌, దేవేంద్ర, స్వప్న, శిల్ప...తమ ఇంటికి తరచూ వస్తుంటారని... 2017 డిసెంబర్‌లో తమ కుమార్తెను నర్సింగ్‌ కోర్సు చదివిస్తామని నరేందర్‌ తీసుకెళ్లాడని ఫిర్యాదులో పేర్కొంది. ఆ తర్వాత రాధ ఇంటికి తిరిగిరాలేదని ఆమె ఆచూకీ కూడా తెలియలేదని ఫిర్యాదులో పేర్కొంది. కొన్ని రోజుల క్రితం ఆంధ్రా ఒడిశా బోర్డర్‌ వద్ద రాధ అలియాస్‌ నిల్చో పేరిట మావోయిస్టు లేఖలు విడుదలవుతున్నాయని... దీంతో తమ కుమార్తెను అపహరించి తీసుకెళ్లి మావోయిస్టు దళంలో చేర్పించారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.

రాధను ఎక్కడకు తీసుకెళ్లారు? ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి... ఉన్నతాధికారులకు విషయాన్ని తెలిపారు. ఈ కేసును ఎన్‌ఐఏ దర్యాప్తు చేయాల్సిందిగా కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో జూన్‌ 3న ఎన్‌ఐఏ మరో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. గతంలో చైతన్య మహిళ సంఘంలో పనిచేసిన శిల్ప, దేవేంద్ర, స్పప్న, నరేందర్‌ నివాసాల్లో ఎన్‌ఐఏ సోదాలు జరిపింది. వారందరినీ అదుపులోకి తీసుకుని మాదాపూర్‌లోని ఎన్‌ఐఏ కార్యాలయానికి తరలించారు. రాధను ఎక్కడకు తీసుకెళ్లారు? ప్రస్తుతం ఆమె ఎక్కడుంది? అనే కోణంలో వారిని విచారిస్తున్నారు. వారి కాల్‌డేటాను కూడా పరిశీలిస్తున్నారు.

"సోదాల విషయంలో ఎన్‌ఐఏ మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. శిల్ప ప్రస్తుతం చైతన్య మహిళా సంఘంలో లేదు. ప్రస్తుతం ప్రజల సమస్యల గురించి పోరాడుతున్నాం. మావోయిస్టు అనుబంధ సంస్థగా ముద్ర వేస్తున్నారని శిల్ప చైతన్య మహిళా సంఘం నుంచి బయటకు వచ్చింది. శిల్పను ఇబ్బంది పెట్టేందుకే ఇలాంటి కేసులు పెడుతున్నారు. గతంలో అర్బన్‌ మావోయిస్టు అని శిల్పను 6 నెలలు జైల్లో ఉంచారు. రాధ మిస్సింగ్‌ కేసుతో శిల్పకు ఎలాంటి సంబంధం లేదు."- బండి కిరణ్‌, అడ్వకేట్​ శిల్ప భర్త

ఇవీ చూడండి :

ABOUT THE AUTHOR

...view details