Thief Arrested: ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాకు చెందిన గణేశ్... ఇంటర్‌లోనే చెడువ్యసనాలకు బానిసై సినిమాపై పిచ్చితో... హైదరాబాద్‌కు వచ్చాడు. కృష్ణానగర్‌కి చేరిన గణేశ్‌కు... ఓ డ్యాన్స్ మాస్టర్ పరిచయమయ్యాడు. సినీపరిశ్రమలో ఎదగాలంటే కష్టమని చెప్పిన డ్యాన్స్ మాస్టర్... డబ్బు సంపాదించాలంటే... దొంగతనాలు చేయమని సలహా ఇచ్చాడు. దీంతో 2012లో తిరిగి కడప వెళ్లిన గణేశ్... తాళం వేసిన ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కడంతో జైలుకి పంపించారు. జైలులో ఇద్దర్ని పరిచయం చేసుకున్న గణేశ్... వారికి బెయిల్ ఇచ్చి బయటకి తీసుకొచ్చాడు. వారితో కలిసి దొంగతనాలు చేశాడు. చోరీ చేయాల్సిన ప్రదేశం, పథకం, ముందస్తు రెక్కీ అన్నీ గణేష్ చూసుకునేవాడు. దొంగతనం చేసిన వారికి 40శాతం వాటా ఇచ్చి మిగిలింది గణేశ్ తీసుకునేవాడు.
2013 లో ఓ దొంగతనం కేసులో మరోసారి అరెస్టయి రాజమండ్రి జైలుకి వెళ్లిన గణేశ్... అక్కడ మరో నేరస్తునితో స్నేహం చేశాడు. వ్యభిచారం చేస్తే మంచి లాభాలు వస్తాయనే అతని సలహాతో... బయటకి వచ్చి 2014 నుంచి 2019 వరకూ తిరుపతిలో వ్యభిచార గృహాలు నడిపించాడు. ఇదే వ్యవహారంలో అలిపిరి పోలీసులకు చిక్కడంతో... అతణ్ని తిరుపతి జైలుకు పంపారు. అక్కడ మరో ముగ్గురు నేరస్తుల్ని పరిచయం చేసుకున్న గణేశ్... వారికి బెయిల్ ఇప్పించి ఇద్దరిని హైదరాబాద్ తీసుకొచ్చాడు. నగరంలోని మేడిపల్లి, భువనగిరి, ఘట్‌కేసర్ పరిధిలోని ఇళ్లల్లో దొంగతనాలు చేయించాడు. చోరీ కేసులో 2019లో మేడిపల్లి పోలీసులు గణేశ్‌ను అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు పంపించారు. 2020లో విడుదలై తిరిగి కడపకు చేరుకున్న గణేశ్... 2021లో మళ్లీ ఇళ్లలో దొంగతనాలకు పాల్పడి కడప జైలుకు వెళ్లాడు.