Woman suicide in Kukatpally: కన్నకొడుకును వదిలించుకుందామని భర్తే అన్నప్పుడు నమ్మలేకపోయింది. మానసిక వికలాంగుడైనంత మాత్రాన అలా ఎలా చేస్తామని ప్రశ్నించింది. కాదు..కూడదనడంతో కాళ్లా వేళ్లాపడింది. అత్తమామలూ భర్తకు తోడై వేధించినా తగ్గలేదు. తన పేగు తెంచుకుని పుట్టిన బిడ్డకు అన్నీ తానై పెంచుకుంటానని, చికిత్స చేయిస్తానని ఎంత చెప్పినా ఆ పాషాణ హృదయులు కనికరించలేదు. బిడ్డను చంపేస్తారన్న భయంతో.. క్షణక్షణం నరకయాతన అనుభవించి..చివరికి తానే బలవన్మరణానికి పాల్పడింది ఓ తల్లి. ఈ హృదయవిదారక ఘటన హైదరాబాద్ కేపీహెచ్బీలో చోటుచేసుకుంది.
సీఐ కిషన్‌కుమార్ వివరాల ప్రకారం.. ఏపీలోని కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి శ్రీధర్‌కు, అదే జిల్లా సర్పవరం ప్రాంతానికి చెందిన రామ వెంకటలక్ష్మి గణపతు స్వాతికి 2013లో వివాహమైంది. వీరు కేపీహెచ్‌బీ పరిధిలోని మంజీరా మెజెస్టిక్ హోమ్స్‌లో ఉంటున్నారు. వీరికి ఏడేళ్ల వయసు బాబు ఉన్నాడు. అతను మానసిక వికలాంగుడు. దీంతో శ్రీధర్‌తోపాటు అతని తల్లిదండ్రులు బాబును ఎలాగైనా వదిలించుకోవాలని స్వాతిపై ఒత్తిడి తెచ్చేవారు.
పలుమార్లు అనాథ శరణాలయంలో వదిలేద్దామనేవారు. స్వాతి ససేమిరా అనడంతో వారి వేధింపులు తీవ్రమయ్యాయి. మరోవైపు బాబుకు చికిత్స అందించేందుకు స్వాతి పుట్టింటివారి సాయం తీసుకుంది. ఇది జీర్ణించుకోలేని అత్తింటివారు మరింత వేధింపులకు గురిచేయడంతో తీవ్ర మానసిక వేదనకు గురైంది. ఆ వేధింపులు తాళలేక స్వాతి (36) ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది.