నిజామాబాద్ జిల్లాలో ఓ ప్రేమ జంట గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. నిజామాబాద్‌లోని గౌతమ్నగర్కి చెందిన ప్రశాంత్ ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో అధ్యాపకుడిగా పని చేస్తున్నాడు. బాన్సువాడ మండలం నెమిలి గ్రామానికి చెందిన జ్యోతి ప్రస్తుతం డిగ్రీ చదువుతోంది. ఇద్దరూ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి విషయం ఇళ్లలో తెలియగా.. వివాహానికి ఒప్పుకోలేదు. పెళ్లితో ఒక్కటవ్వాలనుకున్న వారికి పెద్దలు అడ్డు చెప్పటం వల్ల తీవ్ర మనస్తాపం చెందిన ప్రేమికులు.. చావులోనైనా ఒక్కటవ్వాలనుకున్నారు.
డిచ్పల్లి శివారులోని ఎల్లమ్మ గుడికి చేరుకున్న ఇద్దరు.. బ్లేడ్‌తో గొంతు కోసుకున్నారు. రక్తం కారుతూ.. గిలిగిలలాడుతున్న ప్రేమ జంటను గమనించిన స్థానికులు ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెద్దలు ఒప్పుకోకపోతే.. వారి సమ్మతం కోసం ఓపికగా వేచి చూడాలే తప్పా.. ఇలా విలువైన జీవితాలను అర్ధాంతరంగా ముగించే ప్రయత్నాలు చేయటం మూర్ఖత్వమని పలువురు హెచ్చరిస్తున్నారు. తమపైనే ఎన్నో ఆశలు పెట్టుకున్న ఇరు కుటుంబాలకు దుఃఖం మిగిల్చి.. తమను తాము బలి చేసుకోవటం ప్రేమికుల లక్షణం కాదని చెబుతున్నారు.