Saroor Nagar honor killing: హైదరాబాద్ సరూర్‌నగర్ నాగరాజు హత్యకేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు ఎల్బీ నగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్ వెల్లడించారు. మోబిన్ అహ్మద్, మసూద్ అహ్మద్‌లను అరెస్టు చేసినట్లు తెలిపారు. వారిద్దరు కలిసి చంపినట్లు సీసీ కెమెరా దృశ్యాల్లో గుర్తించామని డీసీపీ తెలిపారు. మృతుడు నాగరాజు వికారాబాద్ జిల్లా స్టేషన్ మర్పల్లి వాసిగా గుర్తించినట్లు పేర్కొన్నారు. కేసు సునితత్వం దృష్ట్యా ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో ట్రయల్ చేసి నిందితులకు త్వరగా శిక్ష పడేలా చూస్తామని డీసీపీ స్పష్టం చేశారు.
''బాల్య స్నేహితులైన నాగరాజు, సుల్తానా ప్రేమించుకున్నారు. నాగరాజు, సుల్తానా జనవరిలో ప్రేమ వివాహం చేసుకున్నారు. చెల్లిని పెళ్లి చేసుకున్నాడనే కోపంతో నాగరాజును చంపారు. నాగరాజు, సుల్తానా ప్రేమ పెళ్లి సుల్తానా కుటుంబీకులకు నచ్చలేదు. సయ్యద్ మోబిన్ నెల రోజులుగా నాగరాజు కోసం వెతికాడు. మలక్‌పేటలో నాగరాజు పనిచేస్తున్న కార్ల షోరూం వద్దకు మోబిన్ వెళ్లాడు. రాత్రి ఇంటికి వెళ్తున్న సమయంలో వెంబడించి నాగరాజును చంపాడు. సుల్తానాను పక్కకు తోసి నాగరాజు తలపై సెంట్రింగ్ రాడ్డుతో దాడి చేసి పారిపోయారు. తీవ్ర రక్తస్రావంతో నాగరాజు అక్కడిక్కడే మృతి చెందాడు. సుల్తానా అన్న మోబిన్, బంధువు మసూద్‌తో కలిసి నాగరాజును చంపారు. నిందితులకు త్వరగా శిక్ష పడేలా చేస్తాం.''
- సన్‌ప్రీత్ సింగ్, ఎల్బీనగర్ డీసీపీ
ఇదీ జరిగింది...రంగారెడ్డి జిల్లా మర్పల్లి గ్రామానికి చెందిన బిల్లాపురం నాగరాజు, మర్పల్లి సమీపంలోని ఘనాపూర్ గ్రామంలో నివసించే సయ్యద్ ఆశ్రిన్ సుల్తానా.. ఏడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలిసి ఆశ్రిన్ కుటుంబ సభ్యులు అతడిని హెచ్చరించారు. ఆశ్రిన్‌ను పెళ్లిచేసుకుందామని నిర్ణయించుకున్న నాగరాజు.. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ కార్ల కంపెనీలో కొద్దినెలల కిందట సేల్స్‌మన్‌గా చేరాడు. కొత్త సంవత్సరం రోజు ఆశ్రిన్‌ను రహస్యంగా కలుసుకున్న నాగరాజు కొద్దిరోజుల్లో పెళ్లి చేసుకుందామని చెప్పాడు. అంగీకరించిన ఆశ్రిన్.. జనవరి చివరి వారంలో పారిపోయి హైదరాబాద్‌కు వచ్చింది. లాల్‌దర్వాజలోని ఆర్యసమాజ్‌లో జనవరి 31న ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.
వివాహం అనంతరం ఎవరూ తమను గుర్తించకుండా నాగరాజు వేరే ఉద్యోగంలోకి మారిపోయాడు. వీరు హైదరాబాద్‌లో ఉంటున్నట్లు ఆశ్రిన్ కుటుంబ సభ్యులు పసిగట్టడంతో కొత్తజంట రెండు నెలల కిందట విశాఖపట్నం వెళ్లి అక్కడే ఉన్నారు. ఎవరూ తమను వెంటాడటం లేదని భావించి.. అయిదు రోజుల కిందట మళ్లీ నగరానికి వచ్చారు. సరూర్‌నగర్‌లోని పంజా అనిల్‌కుమార్ కాలనీలో నివసిస్తున్నారు. వీరి కదలికలను గుర్తించిన ఆశ్రిన్ కుటుంబ సభ్యులు మాటువేశారు. బుధవారం రాత్రి నాగరాజు, ఆశ్రిన్‌లు కాలనీలోంచి బయటకు రాగానే ఆశ్రిన్ సోదరుడు, అతడి స్నేహితుడు బైక్‌పై వారిని వెంబడించి దాడికి పాల్పడ్డారు. నాగరాజుపై ఇనుపరాడ్లు, కత్తులతో దాడి చేసి హత్య చేశారు.
ప్రేమ వివాహాన్ని భరించలేకే సరూర్‌నగర్ హత్య: ఎల్బీనగర్ డీసీపీ ఇవీ చదవండి: