kudikilla Farmer died for Land : నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలో ప్రాజెక్టు కోసం భూమి కోల్పోయిన రైతు... మనస్తాపంతో తనువు చాలించాడు. కుడికిల్ల గ్రామానికి చెందిన రైతు తళ్లారి బాలస్వామి (65) గుండెపోటుతో మృతిచెందారు. తనకున్న భూమిలో రెక్కల కష్టం చేసుకొని బతికే ఆ రైతు భూమి లాక్కుని... పైసా పరిహారం ఇవ్వలేదని గుండె పగిలింది. ఆయన మృతదేహాన్ని పీఎస్‌కే కంపెనీ ఎదుట ఉంచి ఆందోళనకు దిగారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్యాకేజీ ప్రధాన కాలువలో ఉన్న 13 ఎకరాల భూమిని ఆ రైతు కోల్పోయారు. గతంలో కేఎల్ఐ, మిషన్ భగీరథ పథకాల్లోనూ కొంత భూమి కోల్పోయారు. ఉన్న భూమి మరో ప్రాజెక్టు కోసం పోయింది. పరిహారం కోసం కొన్నేళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. అయినా రాకపోవడంతో గతకొంత కాలంగా మనస్తాపానికి గురయ్యారు.
అన్నదాత గుండె పగిలింది..
'భూమి పోయింది.. పరిహారం రాలేదు' అనే మనస్తాపంతోనే గుండెపోటు వచ్చిందని కుటుంబసభ్యులు తెలిపారు. మామిడి తోటను ప్రేమగా పెంచుకున్నారని... ఒక్క చెట్టు కొడితేనే మనస్తాపంతో మృతి చెందాడని కన్నీరు పెట్టుకున్నారు. ఆ భూమి మీద 20 మంది ఆధారపడి బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీ ఎదుట నుంచి ధర్నాకి దిగారు. మృతుని కుటుంబానికి ప్రజా సంఘాలు మద్దతు తెలిపారు. కంపెనీ యాజమాన్యం, అధికారులు బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వం... రైతుల భూములు లాక్కొని... మోసం చేస్తున్నారని ఆరోపించారు. మృతి చెందిన రైతు కుటుంబానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
'పాలమూరు ప్రాజెక్టు కాలువకు మాది 13 ఎకరాల భూమి పోతుంది. మాది చాలా పెద్ద మామిడి తోట. ఒక్క రూపాయి ఇవ్వకుండా మా భూములను దౌర్జన్యంగా తీసుకున్నారు. మేం సంతకాలు పెట్టకుండానే అన్యాయంగా మా భూములను లాక్కున్నారు. అందులో ఉన్న ఒక చెట్టు కొట్టేసరికి ఆ బాధ తట్టుకోలేక బీపీ పెరిగి కిందపడిపోయాడు. ఆస్పత్రిలో 15 రోజులు ఉన్నాడు. మాకు ఎవరు న్యాయం చేయలేదు. మేం ఎవరి చుట్టు తిరగాలి? మా భూమి కోసం కోలాడుతున్నాం.'