రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన గాంధీ ఆస్పత్రి ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. మహబూబ్‌నగర్ నుంచి ఈ నెల 5 న మూత్రపిండాల వ్యాధిని నయం చేసుకునేందుకు వచ్చిన ఓ రోగి అతడి భార్య, మరదలు సాయంగా వచ్చిన అంశం ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మహబూబ్‌నగర్‌కు వెళ్లి కేసుకు సంబంధించిన మరికొన్ని విషయాలు తెలుసుకున్నారు. అక్కాచెల్లెళ్ళు ఆల్కాహాల్ విత్ డ్రాయల్ సింప్టమ్స్‌తో.. ఉన్నారని గుర్తించారు. అక్కడి ఆర్ఎంపీ వైద్యులతో మాట్లాడి ఈ విషయాన్ని ధ్రువీకరించుకున్నారు. ఇక బాధితురాలి సోదరి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తూనే ఉన్నాయి. ఈ కేసులో బాధితురాలిని మహిళా పోలీసులు బుధవారం రహస్య ప్రాంతంలో విచారించారు. ఆమె స్టేట్‌మెంట్‌ను మరోసారి రికార్డు చేశారు. మరోవైపు బాధితురాలి సోదరి కోసం ఆసుపత్రి వార్డుల్లో, ఆసుపత్రి వెలుపల సీసీ కెమెరాలను పరిశీలించగా...ఈ నెల 11వ తేదీ రాత్రి రెండు సీసీ కెమెరాల్లో అక్కాచెల్లెళ్లు కనిపించారు. తర్వాత చెల్లెలు ఒక్కతే ఉన్న దృశ్యాలు కనిపించాయి.
సీసీ కెమెరాల జల్లెడ...
పోలీసులు సేకరించిన సీసీటీవీ దృశ్యాల్లో... ఈ నెల 11న రాత్రి అక్కా చెల్లెళ్లిద్దరూ గాంధీ ఆసుపత్రి నుంచి బయటకు వచ్చారు. తర్వాత మళ్లీ తిరిగి ఆసుపత్రికి వచ్చినట్టు కనిపించలేదు. గాంధీ ఆసుపత్రికి రెండు వైపులా బయట ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. గాంధీ ఆసుపత్రి నుంచి గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, ఇటువైపు పద్మారావునగర్, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వరకు సీసీ కెమెరాల ఫూటేజీలను పరిశీలించారు. ఎక్కడా వీరిద్దరి జాడ కనిపించలేదు. తన భార్య, మరదలు కనిపించడం లేదని తెలుసుకున్న రోగి ఈ నెల 12 రాత్రి ఆసుపత్రి వర్గాలకు సమాచారం ఇవ్వకుండా కుమారుడితో కలిసి మహబూబ్‌నగర్‌కు వెళ్లాడు. అక్కడి వెళ్లాక భార్య, మరదలు కనిపించకపోయినా పోలీసులకు చెప్పలేదు. వీరిద్దరి విషయం అతడికి తెలిసిందా ? లేదా ? అన్న అంశంపై పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు.