కళాశాల భవనంపై నుంచి దూకి ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య (Inter student suicide News) చేసుకున్నాడు. నిజామాబాద్‌లోని ప్రైవేటు కళాశాల భవనంపై నుంచి దూకి సాయికుమార్ అనే ఇంటర్ విద్యార్థి బలవన్మరణం చెందాడు. ఇప్పుడు ఇంటర్ పరీక్షలు లేవు.. ఫలితాలు వచ్చే సమయమూ కాదు.. కానీ ఆ విద్యార్థి చేసిన ఓ తప్పే... భయంగా మారి ఆత్మహత్య చేసుకునేలా చేసింది. అసలు ఆ విద్యార్థి ఏం చేశాడంటే...?
ఇదీ జరిగింది...
సాయికుమార్ అనే ఇంటర్ విద్యార్థి... సోమవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదానికి కారణమయ్యాడు. జిల్లాలోని జక్రాన్ పల్లి మండలం పడకల్‌కు చెందిన సాయి కుమార్.. నగరంలోని కాకతీయ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ప్రైవేటు హాస్టల్లో ఉంటున్న సాయి.. ఈరోజు కళాశాలకు వెళ్లకుండా తెలిసిన వాళ్ల ద్విచక్రవాహనం తీసుకుని నగరంలోని విజయ్ థియేటర్ రోడ్డు వైపు వెళ్లాడు. అక్కడ ద్విచక్రవాహనంతో ఢీకొట్టడంతో పాదచారులకు గాయాలయ్యాయి. దీంతో విద్యార్థిని పట్టుకున్న స్థానికులు తండ్రికి సమాచారం ఇచ్చారు. అలాగే కళాశాలకు తీసుకొచ్చి యాజమాన్యంతో మాట్లాడారు.
ఆ భయంతోనే వెళ్లి...
అదే సమయంలో భయంతో విద్యార్థి సాయి కుమార్ తాను చదివే కళాశాల భవనం మూడో అంతస్తుకు వెళ్లి ఒక్కసారిగా దూకేశాడు. తీవ్ర గాయాలతో పడి ఉన్న విద్యార్థిని పక్కనే ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సాయికుమార్ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆందోళనతోనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్నారు. క్షణికావేశంలో విద్యార్థి ప్రాణం తీసుకున్నాడని చెప్పారు.
ఇదీ చదవండి:Telangana Police: ఖాకీల అత్యుత్సాహం.. వరుస సంఘటనలతో పోలీసుశాఖకు అప్రతిష్ట