తెలంగాణ

telangana

ETV Bharat / crime

కాగ్నా నదిలో ఇసుక తోడేళ్లు.. పట్టించుకోని అధికారులు - illegal sand mining in vikarabad district

కాగ్నా నది నుంచి హద్దు మీరి తెలంగాణలోకి చొరబడి నిత్యం రాత్రి వేళల్లో కర్ణాటకకు చెందిన అక్రమార్కులు ఇసుకను తవ్వేసి తరలిస్తున్నారు. ఎవరైనా అడ్డుకుని ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారు. నిత్యం పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వార తీసుకెళుతున్నారని తెలంగాణ ప్రాంత గ్రామ ప్రజలు పేర్కొంటున్నారు. రెవెన్యూ, పోలీసు అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

sand mafia, illegal sand mining
ఇసుక మాఫియా, ఇసుక దందా, అక్రమ ఇసుక రవాణా

By

Published : May 22, 2021, 11:09 AM IST

వికారాబాద్ జిల్లా బషీరాబాద్‌ మండలం క్యాద్గిర, గంగ్వార్‌, నవాంద్గీ, జీవన్గీ గ్రామాల పరిధి నుంచి కాగ్నానది ప్రవహిస్తోంది. ఈ మూడు గ్రామాల నది అవతలి భాగంలో కర్ణాటక పరిధి ఉంటుంది. క్యాద్గిర, గంగ్వార్‌ పరిధిలో ఇసుక మేటలు పెద్దఎత్తున ఉన్నాయి. తెలంగాణ పరిధిలోకి చొచ్చుకొచ్చి అనుమతులు లేకుండానే హల్కోడ, పోతంగల్‌, జెట్టూరు ప్రాంతాలకు చెందిన కొందరు ట్రాక్టర్లతో రాత్రి వేళల్లో ఇసుకను తరలిస్తున్నారు. తమ ప్రాంతంలో ఉన్న ఇసుకను తీసుకోవాలంటే అనుమతులు లేక తీసుకోవడం లేదని.. మన ఇసుకను కర్ణాటక వారు అక్రమంగా తరలిస్తుంటే అధికారులు నిఘా పెట్టడం లేదని ఆయా గ్రామస్థులు వివరిస్తున్నారు.

నాయకుల అండ :

క్యాద్గిర, గంగ్వార్‌ కాగ్నా ప్రాంతం నుంచి రాత్రి వేళల్లో ఇసుక తరలించేందుకు ఆయా గ్రామాల కొందరు నాయకులు అండగా ఉన్నారని ఆరోపణలున్నాయి. ఇసుక తరలించేందుకు వచ్చి ప్రతి ట్రాక్టరుకు రూ.1000 చొప్పున వసూలు చేస్తున్నారని.. కర్ణాటక ఇసుక ట్రాక్టర్ల యజమానులే వివరిస్తున్నారు. పోలీసు, రెవెన్యూ అధికారులు తరుచూ దాడులు నిర్వహించేందుకు వెళితే.. అప్పటికే పరారవుతున్నారు. వీరికి కొందరు కిందిస్థాయి అధికారుల అండ ఉండడంతో సమాచారం చేరుతుందని రెవెన్యూ, పోలీసు సిబ్బంది పేర్కొంటున్నారు. ఇటీవల తరలింపు మరింత పెరగడంతో పలువురు యువకులు, గ్రామస్థులు వారిని అడ్డుకొని పోలీసులకు సమాచారం అందించడంతో ట్రాక్టర్లతో పరారయ్యారు.

ఆగని దందా :

నదిలో తెలంగాణ, కర్ణాటకు చెరి సగ భాగం ఉందని గతంలో జిల్లా స్థాయి ఇరు రాష్ట్రాల సర్వేయర్లు నిర్ధారించారు. హద్దులు సైతం పాతారు. అయినా రాత్రి వేళల్లో తెలంగాణ పరిధిలోకి వచ్చి తవ్వుతున్నారు. ఎవరైనా అడిగితే, మా పరిధిలోనే తోడుకుంటున్నామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. పరిధి ఎవరిదైనా అక్రమమే అంటూ తెలంగాణ పోలీసులు గతంలో కర్ణాటక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు కర్ణాటకకు చెందిన ఆరు ట్రాక్టర్లను సైతం జప్తు చేశారు. అయినా దందా ఆగడంలేదు.

నిఘా పెడతాం :

క్యాద్గిర, గంగ్వార్‌ సరిహద్దు ప్రాంతంలోని కాగ్నానది నుంచి కర్ణాటకు చెందిన కొందరు ఇసుక తరలిస్తున్నారని గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై రాత్రి వేళల్లో మా సిబ్బందితో నిఘా ఏర్పాటు చేయిస్తాం. ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని కర్ణాటక రెవెన్యూ, పోలీసు అధికారులకు సైతం సమాచారం అందించి అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటాం.

- వెంకటస్వామి, తహసీల్దార్‌, బషీరాబాద్‌

ABOUT THE AUTHOR

...view details