Fake Degree Certificates Case : ఇంజినీరింగ్, డిగ్రీ నకిలీ పట్టాల కేసులో రోజురోజుకూ కొత్తకోణం వెలుగులోకి వస్తోంది. నకిలీ పట్టాల తయారీలో అనకాపల్లి వాసి సూత్రధారిగా పోలీసులు తేల్చారు. భోపాల్‌లోని యూనివర్శిటీ ప్రొఫెసర్ సాయంతో ఈ వ్యవహారం నడిపిస్తున్నట్లుగా గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలపై తీగ లాగితే... డొంక కదులుతోంది.
నకిలీ పట్టాలకు ‘ప్రైవేటు’ అడ్డా
By
Published : Feb 23, 2022, 10:29 AM IST
Fake Degree Certificates Case : ఇంజినీరింగ్, డిగ్రీ నకిలీ పట్టాల రూపకల్పన కేసులో ప్రధాననిందితులను పోలీసులు గుర్తించారు. నకిలీ ధ్రువపత్రాల తయారీలో అనకాపల్లి వాసి.. భోపాల్‌లోని ఎస్‌ఆర్కే అనే ప్రైవేటు విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఈద విజయ్‌కుమార్‌ను సూత్రధారిగా పోలీసులు తేల్చారు. వర్సిటీలో సహాయ ఆచార్యుడిగా పనిచేస్తున్న కేతన్ సింగ్ గుండేలాను తెరపై ఉంచి విజయ్‌కుమార్ ఈ నకిలీ సర్టిఫికేట్ల దందా నడిపినట్లు తేలింది. వర్సిటీలో ఇంజినీరింగ్, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలను పెంచేందుకు ఇలా చేశాడని ప్రాథమిక ఆధారాలు సేకరించారు. వర్సిటీలో కీలకమైన పదవుల్లో ఉన్న డాక్టర్ సునీల్ కపూర్, ప్రొఫెసర్లు జీజీ లడ్డా, గోపాల్‌పాండా, అసోసియేట్ ప్రొఫెసర్ రవీంద్ర గుప్తాలకు ఈ అక్రమాలతో సంబంధం ఉందని తేలడంతో వారిపైనా కేసులు నమోదు చేశారు. విజయ్‌కుమార్ సహా ఇతర నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ప్రైవేటు వర్సిటీ ప్రవేశాల కోసం
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచేందుకు ప్రభుత్వం కొన్నేళ్ల క్రితం ప్రైవేటు వర్సిటీలకు అనుమతులిచ్చింది. సర్వేపల్లి రాధాకృష్ణన్ (ఎస్‌ఆర్కే) పేరుతో భోపాల్‌లో జనక్ కపూర్ తదితరులు ప్రైవేటు వర్సిటీని స్థాపించారు. అప్పటికే ఆ యాజమాన్యానికి ఇంజినీరింగ్, ఎంసీఏ కళాశాలలు ఉండడంతో ప్రభుత్వం నుంచి సులభంగా అనుమతులు లభించాయి. అనకాపల్లిలో జన్మించి భోపాల్‌లో స్థిరపడిన డాక్టర్ ఈద విజయ్‌కుమార్ ఎస్‌ఆర్కే వర్సిటీలో ప్రొఫెసర్‌గా చేరాడు. రెండేళ్లకే విభాగాధిపతిగా మారాడు. అప్పటి నుంచి కీలకంగా వ్యవహరిస్తున్న ఆయన మూడేళ్ల క్రితం వర్సిటీలో ఇంజినీరింగ్, డిగ్రీ ప్రవేశాలు కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో పరీక్షలు రాయకుండానే పట్టాలిచ్చేలా ప్రణాళిక సిద్ధం చేశాడు. ఈ పద్ధతిలో రూ.లక్షలు దండుకుందామంటూ సునీల్‌కపూర్, లడ్డాలకు చెప్పగా వారు అంగీకరించారు. తొలి సంవత్సరం అనుకున్నంతమంది విద్యార్థులు చేరకపోవడంతో హైదరాబాద్, విజయవాడ, వైజాగ్‌ను ఎంచుకున్నారు.
చలో హైదరాబాద్.. రూ.లక్షల్లో కమీషన్లు..
వర్సిటీలో ప్రవేశాలను పెంచే క్రమంలో విజయ్‌కుమార్ రెండేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చాడు. ప్రైవేటు వర్సిటీలకు దూరవిద్య కేంద్రాలు నిర్వహిస్తున్న వ్యక్తులు, విద్య, ఉపాధి అవకాశాల సేవలందిస్తున్న కన్సల్టెన్సీల నిర్వాహకులను కలిశాడు. ఇంజినీరింగ్ చదువుకుంటున్న, మధ్యలో వదిలేసిన విద్యార్థులతోపాటు విదేశాల్లో ఉన్నత విద్య చదివేందుకు వెళ్లేవారికీ తాము ప్రవేశాలు కల్పిస్తామని, పాసైనట్టు ధ్రువపత్రాలు ఇస్తామంటూ వివరించాడు. ఇంజినీరింగ్ ప్రవేశానికి ఒక్కో విద్యార్థికి రూ.లక్ష చొప్పున కమీషన్ ఇస్తామని, ఒక్కసారి మాత్రం భోపాల్‌కు వచ్చివెళ్లాలంటూ చెప్పాడు. రూ. 50 వేలకే డిగ్రీ పట్టా ఇస్తామన్నాడు. ఇక అప్పటి నుంచి కన్సల్టెన్సీల నిర్వాహకులు, దూరవిద్య కేంద్రాలవారు విజయ్‌కుమార్ చెప్పినట్లుగా యువకులు, విద్యార్థులను ఎంచుకున్నారు. ఇంజినీరింగ్ డిగ్రీ రూ. 3 లక్షలు, ఎంసీఏ, ఎమ్మెస్సీ రూ. 1.5 లక్షల నుంచి రూ. 2.5 లక్షలు, డిగ్రీకి రూ. 50 వేల నుంచి రూ.లక్ష వరకు తీసుకునేవారు. కమీషన్ మినహాయించుకుని మిగిలిన సొమ్మును విజయ్‌కుమార్, సునీల్‌కపూర్, కేతన్‌సింగ్ గుండేలాకు ఇస్తున్నారు. హైదరాబాద్ పోలీసులు పట్టుకునే వరకూ ఈ నకిలీ పట్టాల రాకెట్ కొనసాగింది.
నకిలీ ధ్రువపత్రాలతో విదేశాల్లో చదువుతున్న విద్యార్థిపై కేసు
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదివినట్లు నకిలీ ధ్రువపత్రాలతో విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న ఓ విద్యార్థిపై కేసు నమోదైంది. దీనికి సంబంధించి మంగళవారం అదనపు డీసీపీ మురళీధర్ వెల్లడించిన వివరాలు.. ఉత్తమ్ స్వామి అనే విద్యార్థి ఉస్మానియాలో డిగ్రీ పూర్తి చేసినట్లు నకిలీ ధ్రువపత్రాలు కలిగి ఉన్నాడని గిరిజనశక్తి విద్యార్థి నాయకుడు శరత్‌నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ నకిలీ ధ్రువపత్రంతోనే న్యూయార్క్‌లోని పేస్ యూనివర్సిటీలో ఎంబీఏ ప్రవేశం పొందినట్లు అందులో పేర్కొన్నారు. కాగా ఉత్తమ్ స్వామి తమ వర్సిటీలో చదవలేదని, ఆయనవి నకిలీ ధ్రువపత్రాలని ఓయూ కంట్రోలర్ ధ్రువీకరించారు. దీంతో ఆయనపై ఉస్మానియా విశ్వవిద్యాలయం ఠాణాలో ఐపీసీ 467, 471, 420 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ కోసం ఈ కేసును సిట్‌కు బదిలీ చేశారు.